నటీనటులు: కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముతిరఖని, మధు బాల, రెజీనా తదితరులు
సాంకేతికతః సినిమాటోగ్రఫీ: విశాల్ విట్టల్, సంగీత దర్శకుడు: జి వి ప్రకాష్ కుమార్, నిర్మాతలు: విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, ఎడిటర్: ఆంటోనీ, దర్శకుడు: విజయ్ ఎ ఎల్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జయలలిత బయోపిక్ అన్ని అడ్డంకులు దాటి వినాయకచవితికి విడుదలైంది. జయ గురించి బయోపిక్ అనగానే ఆమె గురించి ఏమి చెబుతారో, ఎలాంటి విషయాలు వుంటాయనే ఆసక్తి జనాల్లో కలిగింది. ఇది కేవలం తమిళనాడుకేకాకుండా తెలుగు వారికి కూడా చాలా ఆసక్తిగా మారింది. మరి ఆమె జీవిత చరిత్ర ఎలా తీశారు అనేది తెలుసుకోవాలంటే సినిమా లోకి వెళతాం.
కథ :
అది తమిళనాడు అసెంబ్లీ. అధికార ప్రతిపక్ష పార్టీలమధ్య ప్రజా సమస్యపై వాగ్వివాదం వాడిగా వేడిగా జరుగుతుంది. కరుణానిధి వర్గం వారు ప్రతిపక్ష పార్టీల మధ్య తోపులాట, మాటల యుద్ధం జరుగుతుంది. నాయకురాలైన జయను అక్కసుతో తోసివేయడమేకాకుండా జుట్టుపట్టుకుని హేళన చేస్తారు. బయటకు వచ్చిన జయ మహాభారతంలో ద్రౌపదికి ఇలా జరిగింది. నేడు జయకు జరిగింది. సి.ఎం.గానే నేను అసెంబ్లీకి అడుగుబెడతానని ప్రతినబూనుతుంది.
కట్ చేస్తే, ఉన్నత విద్య అభ్యసించిన జయలలిత (కంగనా రనౌత్) పదహారేళ్ళ వయస్సులోనే తన తల్లి కోరిక ప్రకారం అయిష్టంగానే నాయికగా ఎం.జి.ఆర్.తో నటిస్తుంది. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఎం.జి.ఆర్.తో సినిమాలు తీసే నిర్మాత ఎన్ఎం.ఆర్.కు జయ ఎం.జి.ఆర్.తో చనువుగా వుండడం నచ్చదు. ఆమెను సినిమాల్లోంచి తీసేశాక శివాజీగణేశన్‌తో నటిస్తుంది. ఈలోగా ఎం.జి.ఆర్. సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. గతిలేక మరలా జయతోనే ఎం.జి.ఆర్. నటిస్తాడు. అలా వారి ప్రయాణం రాజకీయాలదాకా వెళుతుంది. మంచి ప్రతిభగల జయ తగు సూచనలు ఎం.జి.ఆర్.కు ఇస్తుంది. ఈ క్రమంలో స్నేహితుడైన కరుణానిధితో ఎం.జి.ఆర్.కు పొరపొచ్చాలు ఏర్పడతాయి. ఆ తరుణంలో జయ ఎటువంటి నిర్ణయం తీసుకుంది. ఎం.ఆర్.ఆర్. రాజకీయ ప్రయాణంలో జయ పాత్ర ఏమిటి. అమ్మగా ఎందుకు పిలిపించుకుంది? అనేది సినిమా.
విశ్లేషణః
ఈ సినిమా చూశాక అసలు జయలలిత చరిత్ర ఓ భాగం మాత్రమే కనిపిస్తుంది. ఆమె సినిమారంగంలోకి ఎలా వచ్చింది. ఎం.జి.ఆర్.తో సాన్నిహిత్యం ఏర్పడడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా ఏవిధంగా ప్రజల మన్నలను పొందింది. అనేది మాత్రమే చూపించారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది లేదు. ప్రజలంతా శశికళ ద్వారా జయ పతనం, మరణం ఇవన్నీ చూపిస్తారనే ఆశతోనే ఉన్నారు. ఈ విషయంలో చిత్ర దర్శక నిర్మాతలు ఏమాత్రం కథను బయటపెట్టకుండా సినిమా చూడండి అంటూ దాట వేసేశారు. వారు ఎప్పుడు చెప్పినా.. జయ పాత్రలో కంగనా, ఎం.జి.ఆర్.గా అరవింద్ స్వామి అద్భుతంగా నటించారని మాత్రమే చెబుతుండేవారు.
అయితే ఈ సినిమాలో ఎం.జి.ఆర్.గా అరవింద్ స్వామి బాగా స్టడీచేసి ఆయన మేనరిజాలతోపాటు ఆహార్యం అచ్చుగుద్దినట్లు అలాగే ప్రవర్తించాడు. అలాగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాత్రలు కూడా చక్కగా అమరాయి. జయలలితగా కంగనా నటించింది అని మాత్రమే చెప్పగలం. ఆమెలా మురిపించలేకపోయింది. మరి ఇతర కీలక పాత్రల్లో ఎం.జి.ఆర్.కు అనుంగుశిష్యుడు, నిర్మాతగా సముద్ర ఖని మెప్పించాడు. కరుణాధిగా నాజర్ సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఇక మిగిలిన పాత్రలు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
అలనాటి హంగులు చక్కగా అమరేలా సెట్‌వేసి మురిపించారు. విజువల్స్ ఆ గ్రాండియర్ సెకండాఫ్ లో కనిపించే సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రధానాకర్షణగా కనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
జయలలిత పూర్తి బయోపిక్ కాకపోవడం. కేవలం ఎం.జి.ఆర్.తో సినిమాలు, రాజకీయ ప్రవేశం, ఆమె సాధక బాధలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన అంశాలేవీ లచ్ చేయలేదు. తెలుగులోనూ శోభన్‌బాబుతో పలు సినిమాలు చేసింది. ఇలా ఎందరో హీరోలతో చేసినా కేవలం తమిళ ప్రజలకోసం రాజకీయాలకోసమే తీసినట్లుగా వుంది. ఈ సినిమా కరోనా సమయంలో తమిళనాడు ఎలక్షన్ల సమయంలో విడులయి వుంటే బహుశా మరలా జయలలిత పార్టీ గెలిచేది అనేలా కథ వుంది. ఇంకా అమ్మ జీవితానికి సంబంధించి తెలియని కోణాలను చూపించినట్టైతే బాగున్ను దాదాపు చాలా మేర అందరికీ తెలిసిన సన్నివేశాలే ఉంటాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు వున్నతంగా కనిపిస్తాయి. జివి ప్రకాష్ సంగీతం సినిమాకే మరో పెద్ద ఎసెట్ గా నిలిచింది. ఇంకా విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ కూడా మళ్ళీ పాత రోజులని మరపిస్తుంది చాలా నీట్ గా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే ఆంటోనీ ఎడిటింగ్ కూడా సినిమాకి తగ్గట్టుగా నీట్ గా ఉంది.
ఇక దర్శకుడు ఏ ఎల్ విజయ్ పెద్ద బాధ్యతను మోశాడనే చెప్పాలి. జయలలిత జీవిత చరిత్రలో రెండు కీలక ఘట్టాలను కూడా హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు.
అంశాలుః
1. ప్రతిభ వుంటే ఆడ, మగ అనే తేడాలేదు. ప్రోత్సహించాలంటూ ఎం.జి.ఆర్. సంభాషణలు
2. ప్రజల్లో దేవుడిగా మారిన హీరోను తన భార్య పిల్లలపై కూడా చూపించనంత ప్రేమను నిర్మాత ఎన్.ఎం.ఆర్. (సముద్రఖని) ఎంజి.ఆర్.పై చూపించడం. చాలా మందిని గుర్తుచేస్తుంది.
3. దుర్వినియోగం అవుతున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎలా రాష్ట్రమంతా సద్వినియోగం జయ చేసిందనే పాయింట్ బాగుంది. ఆ దశలోనే అమ్మగా పిలుపించుకునే విధానం ఆకట్టుకుంది.
4. ఎం.జి.ఆర్. లేకపోయినా ప్రచారకర్తగా అన్నీ తన భుజాలపై మోసిన జయను చివరికి కరివేపాకులా పార్టీ అనుచరులు తీసివేయడం కూడా వర్తమాన రాజకీయాన్ని చూసినట్లుంది.
5. కారు ప్రమాదం అయిన జయను ప్రచారానికి రానీయకుండా పార్టీ కార్యకర్తలు చేస్తారు. కానీ ఆమె నిద్రపోకుండా పార్టీ పనులు చేయడం, శక్తికోసం ఇంజక్షన్‌లు పొడిపించుకోవడం ఆ క్రమంలో ఆమె లావు కావడం అనేవి జరిగాయని అన్యాపదేశంగా దర్శకుడు వెల్లడించాడు.
మొత్తంగా తలైవి (నాయకురాలు) ప్రజల్లోంచి ఎలా పుడుతుంది అని మాత్రమే ఆమె అభిమానిగా నిర్మాత చేసిన ప్రయత్నమిది.అది కూడా ఆసక్తికరంగా వుంది. చూసి ఆస్వాదించవచ్చు.
రేటింగ్ః3.25/5