గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:38 IST)

జ‌యల‌లితగా న‌టించ‌డం వింత‌గా వుందిః కంగనా; కంగనా నుంచి చాలా నేర్చుకున్నా- అర‌వింద్‌

Kangana-Aravindswami
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి,విజ‌యేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
ఈ సంద‌ర్భంగా కంగనా ర‌నౌత్ మాట్లాడుతూ.. ‘మా ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. థాంక్యూ వెరీ మ‌చ్‌. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ  ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోంది. కానీ సినిమా చూసినప్పుడు మీరే (విజయేంద్ర ప్రసాద్) రైట్ అనిపించింది’ అని అన్నారు.
 
అరవింద్ స్వామి మాట్లాడుతూ.. ‘ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. తలైవి సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా టీమ్‌తో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ నటుడిగా ఈ సినిమాలో కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకొని నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు.
 
క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. దర్శకులు, నిర్మాతలు కలిసి ఇండియాలోని బెస్ట్ టీంను తీసుకొచ్చారు. అదే మా సినిమా సక్సెస్. 2017లో తలైవి కథను అరవింద్ స్వామి వద్దకు తీసుకెళ్లాం ఆయన వల్లే  ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు మారిపోయాయి. అరవింద్ స్వామిని అందరూ ఎంజీఆర్‌లానే చూస్తారు. ఈ సినిమాను ఎంతో కష్టపడి తీసుకొస్తున్నాం.. అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
 
పూర్ణ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రాజెక్ట్‌లో పని చేయడమే గొప్ప విషయం. శశికళ పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. కంగనా మేడంతో పని చేయడం కల నిజమైనట్టు అనిపిస్తోంది. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని అన్నారు.
 
Talaivi prerelease
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మూడు సంవత్సరాల క్రితం విష్ణు గారు నన్ను కలిశారు. ఆయన ఎప్పుడూ సినిమానే ఆశగా, శ్వాసగా ఉండేవారు. ఆయన ఈ సినిమా కోసం స్టోరీ రాయమని అడగ్గానే ఓకే అన్నా. కంగనాను ఈ సినిమాలో తీసుకోవాలని చెప్పాను. ఆ కథ చెప్పినప్పుడు వారు వేరే హీరోయిన్‌ను అనుకున్నారు. కానీ నా మైండ్‌లోకి కంగనా వచ్చింది. కానీ ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యే వారు ఎవరు? ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఆమెకు కథ నచ్చింది. నువ్ నీలానే ఉండు.. నీ లానే ప్రవర్తించు అని చెప్పా. అదే జయలలిత అని చెప్పాను. నువ్ ఎంతో ఎత్తుకు ఎదుగుతావ్ అది మాత్రం నాకు తెలుసు.   జయలలితగా కంగనా అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె టాప్ చైర్‌లో ఉంటుందని ముందే చెప్పా. అదే జరుగుతుంది అని చెబుతూ చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేక శుభాకాంక్షలు’ అని చెప్పారు.
 
విజయ్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు సినిమాను ఎంతో ప్రేమిస్తారు. మా సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. అరవింద్ సార్ ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్‌లో కంగనా ఒదిగిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. నేను 2000 సంవత్సరంలో కాలేజ్ పూర్తిచేసి విజయేంద్రప్రసాద్ గారి క్లాసులకు వెళ్లి ఆయనతో కూర్చొని స్టోరీలు రాస్తూ ఎన్నో నేర్చుకున్నా. చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
 
భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ‘ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నాకు తెలిసి గత రెండేళ్లుగా ఈ 'తలైవి' సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నా. ఈ సినిమాలో నటించిన కంగనా రనౌత్, అరవింద్ స్వామి ఎంతో బాగా నటించారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఈ సినిమాలో భాగం కావడంలో కీలక భూమిక పోషించిన విజయ్ సార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా’ అన్నారు.
 
తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. నేను, విష్ణు కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేశాము కానీ అందులో ఈ ప్రాజెక్ట్ వెరీ వేరు స్పెషల్. విష్ణు ఐడియాస్ నాకు తెలుసు కాబట్టి ఆ ధైర్యంతో నేను ఎంటర్ అయ్యాను. జయలలిత లాంటి స్ట్రాంగ్ రోల్ కంగనా లాంటి స్ట్రాంగ్ యాక్టర్ పోషించడం ఆనందంగా ఉంది. ఎంజీఆర్ రోల్ పోషించిన అరవింద్ స్వామి, కంగనాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అన్నారు. 
 
శైలేష్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉంది. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నాం. మా కంటే ఎక్కువగా సినిమానే మాట్లాడాలి’ అని అన్నారు.
 
విష్ణు ఇందూరి మాట్లాడుతూ, తలైవి సినిమా చేయాలనేది మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా గారి ఐడియా. ఆమె జయలలిత గారి అభిమాని. ఆమె చనిపోయినపుడు చాలా బాధపడిన ఆమె, జ‌య‌ల‌లిత‌ చరిత్ర జనానికి తెలియాలని ఈ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు ఎవరైతే న్యాయం చేయగలరని భావించి విజయ్‌ని ఫైనల్ చేశాం. ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ రావాలని 'తలైవి' టైటిల్ పెట్టాం. విజయేంద్ర ప్రసాద్ గారు ఈ ప్రాజెక్టులోకి రాగానే దాని స్వరూపమే మారోపోయింది. ఆయన ఎంటర్ కాగానే జయలలిత క్యారెక్టర్ కోసం కంగనాకు తీసుకుందామని చెప్పారు. కంగనాకు తగ్గట్టుగా ఎంజీఆర్ క్యారెక్టర్ అరవింద్ స్వామిని ఫైనల్ చేశాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి తిరుమల్ రెడ్డి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రొడక్షన్ మేనేజర్ రామకృష్ణ ఎంతోబాగా పనిచేశారు. ఈ సినిమాతో కంగనా రనౌత్‌కి ఐదో నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నా. ఒకటి చెప్పగలను.. నేను నా జీవితంలో ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు.. ఈ సినిమా మరో ఎత్తు అని నా గట్టి నమ్మకం’ అని అన్నారు.