జీవితంలో ఒక్కసారే అలా వచ్చేది - అనుష్క
ఏ నటికైనా జీవితంలో ఒక్కసారైనా వచ్చే పాత్ర జేజమ్మ అని సీనియర్ నటి అనుష్క శెట్టి తెలియజేసింది. అరుంధతి చిత్రానికి జనవరి 16వ తేదీకి 13 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆమె తన ఇన్‌స్టా లో ఈ విషయాన్ని అభిమానులతో పాలుపంచుకుంది. చాలాకాలం సోషల్ మీడియాకు దూరంగా వుంటూ ఇదిగో అదిగో అంటూ ఓ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నదన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె తన వాయిస్ వినిపించింది.
ఈ సందర్భంగా తనకు ఆ పాత్ర ఇచ్చిన కోడి రామకృష్ణ గారికి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది. ప్రేక్షకులందరికి చాలా పెద్ద కృతజ్ఞతలు. ఇవి నా హృదయం నుంచి వస్తున్నవి అని తెలిపింది.
ఇక 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అప్పట్లో ఎటువంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రంలోని పశుపతి డైలాగ్ వైరల్ అవుతూనే ఉంటుంది. దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, అలాగే జేజమ్మగా అనుష్క కనబరిచిన అభినయానికి జనాలు జేజేలు పలికారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.