గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (12:48 IST)

విజయనిర్మలమ్మ మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్ కళ్యాణ్

సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో సందేశాన్ని విడుదల చేశారు. నటిగా, దర్శక-నిర్మాతగా ఆమె సినీరంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. మీనా, హేమాహేమీలు, రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సినిమాలను తెరకెక్కించిన విజయనిర్మల.. ఈ రంగంలో మహిళలు ప్రవేశించేందుకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. విజయనిర్మలగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా విజయనిర్మల భర్త సూపర్ స్టార్ కృష్ణ, కుమారుడు నరేశ్‌లకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
 
అలాగే, సినీ దంపతులు జీవిత రాజశేఖర్లు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. నటిగాను .. దర్శక నిర్మాతగాను విజయనిర్మల గారు ఎన్నో విజయాలను సాధించారు. వ్యక్తిగానూ ఆమె ఎంతోమందికి సహాయ సహకారాలను అందించారు .. ఆమెతో ఎవరినీ పోల్చలేం. మాకు తెలిసిన దగ్గర నుంచి ఒక ఆడపులిగానే ఆమెను చూస్తూ వచ్చాము. అలాంటిది ఈ మధ్య నడవడానికి ఆమె ఇబ్బంది పడుతుండటం చూసి బాధ కలిగింది. ఆమె మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అంటూ తమ సంతాపాన్ని తెలిపారు.