శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:38 IST)

పెద్ద మనసుతో ముందుకొచ్చిన కనికా కపూర్... వైద్యులు ఏమంటారో?

కరోనా వైరస్ బారినపడిన తొలి బాలీవుడ్ సెలెబ్రిటీ ఎవరయ్యా అంటే సింగర్ కనికా కపూర్. లండన్ నుంచి ముంబైకు వచ్చిన ఈమెకు కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత పలువురుకి ఈ వైరస్ సోకేలా నడుచుకుంది. దీంతో ఆమెపై హత్యాయత్న కేసులు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు చికిత్స తర్వాత ఆమె ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో గడుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె ముందుకు వచ్చి పెద్ద మనసు చాటుకుంది. 
 
కరోనా నుంచి కోలుకున్న వారి ప్లాస్మా కరోనా రోగుల చికిత్సలో పని చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ప్లాస్మా ఇచ్చేందుకు కరోనా రోగుల్లో పలువురు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కనికా కపూర్‌ తన ప్లాస్మా ఇస్తానంటూ లక్నోలోని కింగ్‌ జార్జ్ మెడికల్‌ వర్సిటీ (కేజీఎంయూ) ఆసుపత్రికి తెలిపింది. ఈ మేరకు ఆ ఆసుపత్రిలోని సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపింది.
 
'సోమవారం ఉదయం నేను ఆ ఆసుపత్రికి ఫోన్‌ చేసి, నా రక్తం దానం చేస్తానని చెప్పాను. ఇవి కరోనా వైరస్‌పై పరిశోధనలు, చికిత్స కోసం ఉపయోగపడతాయి. నాకు వీలైనంత సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లాస్మా దానం కోసం నిన్న నేను శాంపుల్‌ కూడా ఇచ్చాను' అని కనికా కపూర్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
అయితే, ప్లాస్మా డొనేట్ చేసేవారిలో హిమోగ్లోబిన్ శాతం 12.5 శాతం కంటే ఎక్కువగా ఉండాలి. బరువు 50 కేజీలకు పైగా ఉండాలి. ముఖ్యంగా, మధుమేహంతో పాటు... గుండె సంబంధిత సమస్యలు ఏవీ ఉండకూడదు. అలాంటి వారి నుంచే ప్లాస్మా థెరపీ చికిత్స కోసం రక్తాన్ని సేకరిస్తారు.