శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (21:00 IST)

ప్లాస్మా థెరపీతో కరోనా రోగికి చికిత్స సక్సెస్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ముఖ్యంగా, ఈ వైరస్‌ను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను పలు దేశాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి మందును కనిపెట్టలేదు. దీంతో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ బారినపడిన రోగి ఉపశమనం పొందాలంటే.. ప్లాస్మా థెరపీనే ఏకైక మార్గంగా తెలుస్తోంది. ఏప్రిల్ 4న ఢిల్లీలోని సాకేత్ ఏరియా ఆసుపత్రిలో ఆ వ్యక్తి చేరాడు. తీవ్ర జర్వం, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నుమోనియా డవలప్ కావడం, శ్వాస పరిస్థితి కూడా విషమించడంతో ఏప్రిల్ 8న అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 
 
అయితే పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించకపోవడంతో మానవతా దృక్పథంతో ఆయనకు ప్లాస్మా థెరపీ అందించారు. అనూహ్యంగా ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. నాలుగో రోజు వచ్చేసరికి వెంటలేటర్ అవసరం లేకుండాపోయింది. ఏప్రిల్ 18 వరకూ వైద్యులు సప్లిమెంటరీ ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. పూర్తిగా కోలుకోవడంతో ఆదివారంనాడు ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు.
 
ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడి ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న 49 ఏళ్ల వ్యక్తి ఆదివారం పూర్తిగా కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కరోనా వైరస్‌కు ఇక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న తొలి వ్యక్తి ఇతడే కావడం విశేషం. ప్లాస్మా థెరపీతో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన రెండు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.