కోలీవుడ్‌లో సినీ నటి దీప ఆత్మహత్య
తమిళ చిత్రపరిశ్రమలో విషాదకర ఘటన జరిగింది. సినీ నటి దీప అలియా ఫౌలిన్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన అమల్‌నాథన్ అనే వ్యక్తి కుమార్తె దీప. తమిళ చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నారు. చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ సహాయ నటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగారు. "వాళ్‌కై", "వాయిదా" వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. మరికొన్ని చిత్రాల్లోనూ నటిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె చెన్నై, విరుగంబాక్కంలోని మల్లిగై బహుళ అంతస్తు భవనంలోని ఓ ఫ్లాట్‌లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆమె ఆదివారం ఉదయం ఈ ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఆమె స్నేహితుడు ప్రభాకరన్ విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత దీప సోదరుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అయితే, ఆమె ఉన్న ఫ్లాట్‌లో పోలీసులు తనిఖీ చేయగా, ఒక డైరీని, మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. "ఈ లోకం నాకేమాత్రం నచ్చలేదు. నాకు ఎవరూ అండగా లేరు. అందువల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. గత యేడాది కాలంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చాను.
కానీ ఆ వ్యక్తి నా ప్రేమను అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాను. అందుకే ఈ ప్రపంచంలో జీవించేందుకు ఇష్టంలేదు. విరక్తి కలిగింది" అని పేర్కొన్నారు. దీంతో దీప ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమైవున్నారు.