గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 23 జనవరి 2017 (17:15 IST)

మహానటుడి నటవిశ్వరూపం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం : క్రిష్ లేఖ

'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయయాత్రను అమెరికాలో నిర్వహించారు. ఆదివారం రాత్రితో విజయయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌.. అందరికీ తెలిసేలా ఓ లెటర్‌ను సోమవారంనాడు పోస్ట్‌ చేశారు...

'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయయాత్రను అమెరికాలో నిర్వహించారు. ఆదివారం రాత్రితో విజయయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్‌.. అందరికీ తెలిసేలా ఓ లెటర్‌ను సోమవారంనాడు పోస్ట్‌ చేశారు... 
 
ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం... తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం.. మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియటం లేదు. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా ఉంటుందనుకున్నాను, కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు. నాకైతే, నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్ళనిండా మనసు నింపుకుని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం రుజువైంది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తెర మీద కరవాల ధ్వనులు, తెర ముందు కారతాళధ్వనులు, థియేటర్ల ముందు సాహో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అంటూ నినదిస్తున్న ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయ్. 
 
ఫోన్లో అభినందనలు వింటుంటే మరెన్నో అభినందనలు బీప్ శబ్దాలు చేస్తూ ఎదురుచూస్తున్నాయి. విశ్రాంతి లేదు, విరామం లేదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి ఫోన్ 12వ తేదీ నుంచి మోగుతూనే ఉంది, మాట్లాడుతూనే వుంది. వాళ్ళ కళ్లలో కదులుతున్న సంతోష తరంగాలు గొంతులలో వినిపిస్తున్నాయి. మనసుకి కనిపిస్తున్నాయి. ప్రతి చోటా, ప్రతి నోటా ప్రశంసల వర్షం కురుస్తూనే వుంది. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్న తేడా లేకుండా ప్రతి మాధ్యమం ప్రోత్సహిస్తూనే వుంది. ఏం చెప్పాలి.. ఎలా స్పందించాలి? ఇది తొంభై తొమ్మిది చిత్రాల నాటానుభవాన్ని తన వందవ చిత్రంలో ఆవిష్కరించిన ఒక మహానటుడి నటవిశ్వరూపం. ఈ విజయం ఆయన అందించిన ప్రోత్సాహాఫలం. మన తెలుగు ప్రేక్షకులందరికి ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను.. నా జీవితంలో ప్రతినిమిషాన్ని మీకు చెప్పాల్సిన ఓ కృతజ్ఞతగా భావిస్తాను.