చరిత్రను తిరగరాసిన ఆ తేదీనే.. రిలీజ్ చేయమంటున్న అక్కినేని అభిమానులు
అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాతలు బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కానీ.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. దీంతో అభిమానులు తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన తేదీనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని రిలీజ్ చేయమంటున్నారు. ఇంతకీ ఆ తేదీ ఎప్పుడో..? తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిన సినిమాలు ఏంటి అనుకుంటున్నారా..?
నందమూరి తారకరామారావు, కె . రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన సంచలన చిత్రం అడవి రాముడు. ఈ సినిమాలోని కథ, కథనం.. పాటలు.. ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉండడంతో అడవి రాముడు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఇంతటి సంచలనాన్ని సృష్టించిన అడవి రాముడు సినిమా ఏప్రిల్ 28, 1977లో రిలీజ్ అయింది.
ఆ తరువాత మహేష్ బాబు కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన సినిమా పోకిరి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి మూవీ అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కూడా అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ కూడా ఏప్రిల్ 28నే రిలీజైంది.
2006లో వచ్చిన పోకిరి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచింది.
ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి 2. ఈ సినిమా చరిత్రను తిరగ రాసి , తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్‌గా ఎదిగేలా చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించిపెట్టింది. తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిన బాహుబలి 2 మూవీ కూడా ఏప్రిల్ 28నే రిలీజైంది.
2017లో రిలీజ్ అయిన బాహుబలి 2, 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్‌ను తిరగ రాసి సరికొత్త రికార్డులను సృష్టించిన అడవి రాముడు, పోకిరి, బాహుబలి 2.. ఈ మూడు సినిమాలు ఏప్రిల్ 28న రిలీజ్ కావడం విశేషం. దీంతో ఈ ఏప్రిల్ 28 తెలుగు సినిమా పరిశ్రమకు సెంటిమెంట్ డేట్‌గా మారింది.
దీంతో అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తే బాగుంటుందని.. సెంటిమెంట్ వర్కవుట్ అయి.. అఖిల్‌కి బిగ్ సక్సెస్ వస్తుందని.. ఆ తేదీనే రిలీజ్ చేయమని అభిమానులు కోరుతున్నారు. మరి.. అభిమానుల కోరిక మేరకు ఏప్రిల్ 28నే రిలీజ్ చేస్తారా..? లేక వేరే డేట్లో రిలీజ్ చేస్తారో..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.