పదివేల మంది పేదలకు జగపతి బాబు నిత్యావసర సరుకులు- పెద్ద మనసు
కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా విధించిన లాక్‌డౌన్ వల్ల దినసరి వేతనం పొందే ఎంతోమంది సినీ కార్మికులు, పేదలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల విలక్షణ నటుడు జగపతిబాబు చాలా మంది సినీ కార్మికులకు తనే స్వయంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు.
అలాగే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ని పకడ్బందీగా నిర్వహిస్తున్న పోలీసులకి గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఇటీవల ఇబ్బందులలో ఉన్న పదివేల మంది పేదలకి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు అని తెలిసింది.
ఇదే విషయాన్ని జగపతి బాబుని అడగగా ``సహాయం చేసిన మాట వాస్తవమే కాని చేసిన ప్రతి సహాయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా... ఆపదలో ఉన్న వారికి సహాయం చేశాను` అని ఎంతో సింపుల్‌గా, హంబుల్‌గా చెప్పారు.
జగపతిబాబు తండ్రి ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ కూడా ఎన్నో గుప్తదానాలు చేసేవారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అందరి ఆదరాభిమానాల్ని అందుకున్న జగపతి బాబు కష్టాల్లో ఫ్యామిలీస్‌ని ఆదుకోవడం అభినందించాల్సిన విషయం.