బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (18:04 IST)

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

prajwal revanna
దేశ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవన్న కుమారుడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితం తలకిందులైపోయింది. ఒకపుడు పార్లమెంట్ సభ్యుడుగా నెలకు లక్ష రూపాయల వేతనం అందుకుంటూ వచ్చిన ఆయన ఇపుడు జైలు పక్షిలా మారిపోయి, సాధారణ ఖైదీలా బతుకుతున్నాడు. ఓ మహిళపై అత్యాచారం జరిపిన కేసులో ఆయనకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు చనిపోయేంత వరకు జీవిత కారాగార శిక్షను విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. 
 
ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఓ ముద్దాయిగా ఉంటున్నాడు. జైలు నిబంధనల ప్రకారం, ఆయనకు నెలకు కేవలం రూ.540 మాత్రమే వేతనంగా లభించే అవకాశం ఉంది. అది కూడా జైలు అధికారులు ఏదైనా పని కేటాయిస్తేనే సాధ్యమవుతుంది. ఎంపీగా రూ.1.2 లక్షల వేతనం, ఇతర సౌకర్యాలు అందుకున్న ఆయన... తన దారుణ మనస్తత్వం కారణంగా జైలుపాలై సాధారణ ఖైదీలా రోజులు వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
జైలులో ప్రజ్వల్ రేవణ్ణ రోజువారీ జీవితం ఇతర ఖైదీల మాదిరిగానే ఉంటుంది. ఆయన దినచర్య ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే మొదలవుతుంది. అల్పాహారం ముగించుకున్న తర్వాత అధికారులు కేటాయించిన పనులకు వెళ్లాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం, మొదట్లో ఆయనకు బేకరీలో సహాయకుడిగా లేదా సాధారణ టైలరింగ్ వంటి నైపుణ్యం అవసరం లేని పనులను అప్పగిస్తారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఈ పనులు చేసిన తర్వాతే, ఆయన అర్హతను బట్టి నేతపని లేదా కమ్మరి పనుల వంటి నైపుణ్యంతో కూడిన పనులకు మారే అవకాశం ఉంటుంది.
prajwal revanna
 
ఇక భోజనం విషయంలోనూ ప్రత్యేక నిబంధనలేమీ ఉండవు. అల్పాహారంలో వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన టిఫిన్ అందిస్తారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్య భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో చపాతీలు, రాగి ముద్దలు, సాంబార్, అన్నం, మజ్జిగ ఉంటాయి. వారంలో మంగళవారం గుడ్డు, నెలలో మొదటి, మూడో శుక్రవారం మటన్, రెండో, నాలుగో శనివారం చికెన్ అందిస్తారు.
 
ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనలే ప్రజ్వలూ వర్తిస్తాయి. వారానికి రెండుసార్లు, ఒక్కో కాల్ 10 నిమిషాల చొప్పున కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతిస్తారు. అలాగే, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను కలుసుకునే అవకాశం కల్పిస్తారు.