శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (15:34 IST)

ఎన్నికల తేదీలపై క్లారిటీ లేని మా సమావేశం - ఎన్నికలపై భిన్న స్వరాలు

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల సంఘమైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఇందులో ఎన్నికల తేదీపై ఎటూ తేల్చకుండానే సమావేశం ముగిసింది. 
 
ఈ సమావేశంలో 'మా' ఎన్నికలపై చర్చించినా, ఎన్నికలు ఎప్పుడు జరపాలన్నదానిపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. దీనిపై 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, మురళీమోహన్ స్పందించారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు.
 
మరోవైపు, 'మా' ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ మాట్లాడుతూ, ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. కొందరు సెప్టెంబరు, కొందరు అక్టోబరు అంటున్నారని వ్యాఖ్యానించారు. డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తానని నరేశ్ స్పష్టం చేశారు. 
 
అటు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ, వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. 'మా' సర్వసభ్య సమావేశం జరిపిన 21 రోజుల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబరు 12న కాకుంటే సెప్టెంబరు 19న ఎన్నికలు జరపాలని సూచించారు.