మంచి సందేశాన్నిచ్చే ‘మా వింతగాధ వినుమా’
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆహా ఆకట్టుకుంటోంది. నవంబర్ నెలను మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఆహా మారుస్తుంది. అందులో భాగంగా నవంబర్ 13న మా వింతగాధ వినుమా చిత్రం ఆహాలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించారు. కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో జోడీగా నటించిన సిద్దు జొన్నలగడ్డ, శీరత్‌కపూర్ ఇందులో జంటగా నటించారు.
సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ, గుంటూరు టాకీస్ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అయ్యింది. అయితే హీరోగా నాకు అనుకున్నంత బ్రేక్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఓ 'లవ్‌స్టోరి' చేయాలని నిర్ణయించుకున్నాను. లవ్‌స్టోరి వర్కవుట్ అయితే మనకు బ్రేక్ వస్తుందని నేను అనుకున్నాను. అప్పటికే ప్రవీణ్ సత్తారుతో కలిసి గుంటూరుటాకీస్ సినిమాకు రైటింగ్ విభాగంలో వర్క్ చేయడంతో ఆ అనుభవంతో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు విన్న, చూసిన అనుభవాలతో ఓ లవ్‌స్టోరి రాసుకున్నాను.
సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నేను, డైరెక్టర్ ఆదిత్య అంత క్లోజ్ కాదు. అలాగే నువ్వు ఈ పనే చేయాలి, నేను ఈ పనే చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి ఇద్దరూ ఈజీగా వర్క్ చేసుకుంటూ వెళ్లాం. శీరత్ కపూర్‌తో నేను రెండోసారి కలిసి చేసిన సినిమా. ఆమె నాకు రెండు, మూడేళ్లుగా తెలుసు. మంచి స్నేహితురాలు. దాని వల్ల మామధ్య ఓ కంఫర్ట్ జోన్ క్రియేట్ అయ్యింది. అందువల్ల మా మధ్య ఈ సినిమాలో చక్కటి కెమిస్ట్రీ కూడా క్రియేట్ అయ్యింది. అది స్క్రీన్‌పై కనపడింది. తను గత చిత్రాల కంటే ఈ సినిమాలో ఇంకా మంచి పెర్‌ఫార్మెన్స్ చేసింది.
లాక్డౌన్‌లో నేను యాక్ట్ చేసిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మంచి విజయాలను కూడా సాధించాయి. రానా నన్ను బాగా అప్రిషియేట్ చేశాడు. లాక్‌డౌన్ స్టార్ అంటూ తను నన్ను ఆటపట్టించాడు. సంస్కృతి అంటే గుడికో.. మరెక్కడికో వెళ్లడం కాదు. మన తోటివారిని గౌరవించడమని నా భావన. ఈ సినిమాలో రియలిస్టిక్ లైఫ్‌ను తెరపై చూపించే ప్రయత్నం చేశాను. ఇందులో నేను యూత్‌కు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. అసలు యూత్ ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని చూపించానని అనుకుంటున్నాను.
సోషల్ మీడియా చాలా డెవలప్ అయిన నేటి పరిస్థితుల్లో మనం ఏదైనా విషయాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నప్పుడు దాన్ని షేర్ చేయొచ్చా అని ఆలోచించాలి. మనం చేసే పనికి ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. మనం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఎక్కువ లైక్స్ వస్తే గొప్ప అని, తక్కువ లైక్స్ వస్తే వేస్ట్ అని అలవాటు చేసింది. ఇదొక రకమైన ట్రాప్. ఇందులో మనం ఇరుక్కోకూడదు.
తనికెళ్ల భరణి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేసేటప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. సీన్ చేసే ముందు డైలాగ్స్ గురించి నాతో డిస్కస్ చేసి యాక్ట్ చేశారు. ప్రస్తుతం నటుడిగా, రైటర్‌గా ఉన్నాను.. ఇప్పట్లో దర్శకత్వం చేసే ఆలోచనలు లేవు. యాక్టింగే నా ఫస్ట్ లవ్. రైటింగ్ చేసే ఉద్దేశమే లేదు. కానీ అలవాటైంది. ఇప్పడు చేసిన రెండు సినిమాలు రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ అయితే.. నెక్ట్స్ మూవీ నరుడి బ్రతుకు నటన.. ఓ క్రైమ్ కామెడీ. ఓ యాక్టర్‌గా అన్ని రకాల జోనర్ సినిమాస్‌లో నటించాలి.. నటిస్తాను కూడా.
థియేటర్లో సినిమా చూడటం, ఓటీటీలో సినిమా చూడటం అనే రెండు విషయాలను పోల్చకూడదు. రెండు వేర్వేరు ఎక్స్‌పీరియెన్స్‌లను ఇస్తుంది. ఒక దాన్ని మరోటి రీప్లేస్ చేయదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో రెండు సినిమాలు చేస్తున్నాను. అలాగే మరో బ్యానర్‌లోనూ సినిమా చేయబోతున్నాను. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.