బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (17:13 IST)

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Suryadevara Nagavamsi
Suryadevara Nagavamsi
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన ఈ 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు.

మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ఈ చిత్రం, భారీ వసూళ్లు సాధిస్తూ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశీ, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
 
- సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం సంతోషంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లను దృష్టిలో ఉంచుకొని, మొదటి వారాంతం కొన్ని చోట్ల టికెట్ ధరలను పెంచడం జరిగింది. మొదటి వారాంతం వచ్చిన వసూళ్లతో అందరూ సంతోషంగా ఉన్నాం. అందుకే ఈరోజు అన్ని చోట్లా సాధారణ టికెట్ ధరలతోనే సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు మరింత మంది మా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
 
- సీక్వెల్ హైప్ తో ఆడటానికి ఇది పెద్ద హీరో సినిమా కాదు, భారీ బడ్జెట్ సినిమా కాదు. అయినా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వినోదం. మేము స్వయంగా థియేటర్లకు వెళ్లి చూశాము. ప్రేక్షకులు సినిమా చూస్తూ, ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
 
- సెకండ్ హాఫ్ డల్ అయిందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ, నిజానికి ప్రేక్షకులు సెకండ్ హాఫ్ నే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. సునీల్ గారి ట్రాక్ అందరికీ బాగా నచ్చింది.
 
- మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే.. కథ, లాజిక్స్ ని పక్కన పెట్టి ఈ సినిమాని చూడమని మేము కోరాము. ప్రేక్షకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలం నవ్వుకోవడానికి ఈ సినిమాని చూస్తున్నారు. అందుకే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. 
 
- ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఎలాగైతే మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో.. మ్యాడ్ స్క్వేర్ కూడా నాలుగు రోజుల్లోనే దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
 
- రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. కానీ, కొందరు సినిమాని చంపేయాలనే ఉద్దేశంతో.. రివ్యూ రాసి ఊరుకోకుండా, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అది తప్పు. సినిమా బతికితేనే, అందరం బాగుంటాం అనే విషయాన్ని గ్రహించాలి.