ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (15:35 IST)

'తలైవా' నీకిది తగునా? మద్రాస్ హైకోర్టు వార్నింగ్... అపరాధం విధిస్తాం...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో అపరాధం విధించాల్సి ఉంటుందని తెలిపింది. అసలు రజినీకాంత్‌ను హైకోర్టు మందలించడం ఏమిటనే కదా మీ సందేహం. అయితే, ఈ వివరాల్లోకి వెళదాం... 
 
స్థానిక చెన్నై, కోడంబాక్కంలో రజనీకాంత్‌కు శ్రీ రాఘవేంద్ర కళ్యాణమండపం ఉంది. దీన్ని చెన్నై నగర పాలక సంస్థ ఆస్తి పన్ను రూ.6.50 లక్షలు చెల్లించాలంటూ నోటీసు పంపించింది. 
 
ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కల్యాణమంటపాన్ని మూసి ఉంచామని... అప్పటి నుంచి దాన్నుంచి తనకు ఎలాంటి ఆదాయం లేదని, కార్పొరేషన్ విధించిన పన్నును తాను చెల్లించలేనని పిటిషన్‌లో రజనీ పేర్కొన్నారు.
 
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
 
ఈ నేపథ్యంలో, రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి శాంతి, వారికి కొంత సమయం ఇచ్చారు. 
 
కాగా, ఒక చిత్రంలో నటిస్తే కోట్లాది రూపాయల మేరకు పారితోషికం తీసుకునే రజినీకాంత్ కేవలం రూ.6.50 లక్షల ఆస్తి పన్ను చెల్లించలేనని హైకోర్టును ఆశ్రయించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
గతంలో కూడా ఆయన సతీమణి లతా రజినీకాంత్ ఆధ్వర్యంలో నడిచే ది ఆశ్రం స్కూల్స్ భవనాలకు కూడా అద్దె చెల్లించక పోవడంతో ఆ భవనాల యజమాని హైకోర్టు ఆశ్రయించగా, కోర్టు చీవాట్లు పెట్టి, తక్షణం అద్దె చెల్లించాలని ఆదేశించిన విషయం తెల్సిందే.