సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 4 మే 2019 (20:58 IST)

మన 'మహానటి' చిత్రానికి అరుదైన గౌరవం...

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్లో సి.అశ్వినీ దత్ కుమార్తెలు నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా ఈ చిత్రం  నాగ్ అశ్విన్‌కు ఓ ప్రత్యేక స్థాయిని తెచ్చిపెట్టింది. విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. 
 
అంతేకాదు ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అయితే నిజంగా సావిత్రి గారిలా పరకాయ ప్రవేశం చేశారా అన్న రీతిలో నటించి, నటనలో తనకు తనే సాటి అన్న రీతిగా సావిత్రి పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందింది. అయితే తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.
 
షాంగైలో జరుగుతున్న షాంగై ఫిలిం ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మహానటి సినిమాను మెయిన్ ల్యాండ్‌లో  ప్రదర్శించనున్నారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత అక్కినేనిలతో పాటు దక్షిణాది భాషలకు చెందిన అనేకమంది నటీనటులు ఈ సినిమాలో నటించారు.