మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:29 IST)

కంగనా ట్విట్టర్ ఖాతాను పర్మినెంట్‌గా బ్లాక్ చేయలేం : హైకోర్టులో 'మహా' సర్కారు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేసేలా ఆదేశించాలంటూ మహారాష్ట్ర హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా మహారాష్ట్ర సర్కారు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. కంగన ట్విట్టర్ ఖాతాను రద్దు చేయడం కుదరదని బాంబే హైకోర్టుకు తేల్చి చెప్పింది.
 
కాగా, ఇటీవలికాలంలో కంగనా రనౌత్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆమెపై మహారాష్ట్ర సర్కారు ప్రతీకార చర్యలకు పాల్పడటం వంటి పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అయినప్పటికీ కంగనా రనౌత్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 
 
ముఖ్యంగా, ఆమె చేసే ట్వీట్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ట్వీట్ల ద్వారా దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బాలీవుడ్ నటి కంగన ప్రయత్నిస్తున్నారని, ఆమె ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో న్యాయవాది అలీ కాషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టులో గురువారం క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ముఖ్యంగా, తన ట్వీట్లతో విద్వేషాలు రెచ్చగొడుతున్న కంగన ట్విట్టర్ ఖాతాను రద్దు చేసేలా ట్విట్టర్‌కు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఈ సందర్భంగా కంగన, ఆమె సోదరి రంగోలి చందేల్ చేసిన ట్వీట్లను ఉదాహరించారు. సమాజంలోని ఓ వర్గాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకుని ట్విట్టర్ వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తోనూ పోల్చారని గుర్తు చేశారు.
 
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. దేశ్‌ముఖ్ పిటిషన్‌పై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది వైపీ యాగ్నిక్ తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వాదనలను వ్యతిరేకించారు. అస్పష్టంగా ఉన్న ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
 
కంగన ట్వీట్లు ప్రజలను ఎలా ప్రభావం చేశాయో పిటిషనర్ వివరించలేదన్నారు. పిటిషన్ అస్పష్టంగా ఉందని, ట్విట్టర్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అని పేర్కొన్నారు. ఇలాంటి అస్పష్టమైన పిటిషన్‌తో ఉపశమనం పొందడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కాబట్టి పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.