బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (08:16 IST)

కంగనా రనౌత్‌తో పెట్టుకుంటే అంతే మరీ...

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ అంటే.. ఓ హడల్. మహారాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. దీనికి ప్రతీకారంగా ఆ రాష్ట్ర పాలకులు కంగనా రనౌత్ సినీ కార్యాలయాన్ని బీఎంసీ అధికారులతో కూల్చివేయించారు. ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. 
 
ఇపుడు కంగనాను పంజాబీ స్టార్ సింగ్ దల్జీత్ దోసంజ్ కెలికాడు. అంతే.. వారిద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పటివరకు ట్విట్టర్‌లో నామమాత్రపు ఫాలోవర్లు మాత్రమే కలిగిన దిల్జీత్‌కు కంగనతో పెట్టుకున్నాక రెండు రోజుల్లోనే ఏకంగా 4 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరడం విశేషం. ప్రస్తుతం అతడి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4.3 మిలియన్లు. 
 
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు దిల్జీత్ మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నాడు. కాగా, రైతుల ఆందోళనలో పాల్గొన్న ఓ పంజాబీ వృద్ధ మహిళా రైతును 82 ఏళ్ల బిల్కీస్ బానోగా పొరపాటు పడింది. 
 
ఈ ఏడాది మొదట్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న బిల్కీస్ బానో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. రైతు ఉద్యమంలో పాల్గొన్నది కూడా ఆమేనని పొరపాటు పడిన కంగన.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. 
 
రైతు ఆందోళనలో 'షహీన్‌బాగ్ దాదీ' అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. అంతేకాదు, టైమ్ మ్యాగజైన్‌పైకి ఎక్కిన 'ఆమె' ఇప్పుడు 100 రూపాయలకే అందుబాటులో ఉందంటూ పరుష వ్యాఖ్యలు చేసింది. అయితే, రైతుల ఉద్యమంలో పాల్గొన్నది బిల్కీస్ బానో కాదని, ట్విట్టర్ యూజర్లు గుర్తించి హెచ్చరించడంతో కంగన తన ట్వీట్‌ను డిలీట్ చేసింది.
 
కంగన ట్వీట్‌పై స్పందించిన దిల్జీత్  ఓ వీడియోను షేర్ చేస్తూ రైతు ఉద్యమంలో పాల్గొన్న ఆ పెద్దావిడను మహీందర్ కౌర్‌గా పేర్కొన్నాడు. గుడ్డిగా ఏదిపడితే అది మాట్లాడొద్దని, ఈ వీడియో చూసి నిర్ధారించుకోవాలని కంగను ఘాటుగా హెచ్చరించాడు. 
 
దిల్జీత్ ట్వీట్‌కు ఊగిపోయిన కంగన.. దిల్జీత్‌ను దర్శకనిర్మాత కరణ్ జోహార్ పెంపుడు జంతువుగా అభివర్ణించింది. అక్కడితో ఆగక అతడి బూట్లు నాకుతాడని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
ఇలా వీరిమధ్య జరుగుతున్న ట్వీట్ల యుద్ధంలోకి కంగన అభిమానులు కూడా చేరారు. మీమ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దిల్జీత్ వర్సెస్ కంగన (#DiljitVsKangana), దిల్జీత్ డెస్ట్రాయ్‌స్ కంగన (#DiljitDestroysKangana) తదితర హ్యాష్‌ట్యాగ్స్‌తో కొత్త టాపిక్‌లను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో దల్జీత్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.