గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (18:13 IST)

మురిపించని 'మన్మథుడు'.. కొంపముంచిన కలెక్షన్లు?

నటీనటులు: అక్కినేని నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లక్ష్మి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, నిశాంతి తదితరులు.
దర్శకత్వం: రాహుల్‌ రవీంద్రన్‌
నిర్మాత: అక్కినేని నాగార్జున - కిరణ్‌, 
సాంకేతికత: సంగీతం:ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌, చైతన్‌ భరద్వాజ్‌, 
మాటలు: కిట్టు విస్సాప్రగడ - రాహుల్‌ రవీంద్రన్‌, 
కథా సహకారం: సత్యానంద్‌, స్క్రీన్‌ - ప్లే: రాహుల్‌ రవీంద్రన్‌ - సత్యానంద్‌, 
 
నాగార్జున ఎప్పుడో తీసిన 'మన్మథుడు' ఇప్పటికీ అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బుల్లితెరపై ఇస్తూనే వుంటుంది. అలాంటి సినిమాను సీక్వెల్‌కాకపోయినా మన్మథుడు2 అని పేరుపెట్టి మరీ తీశాడు. ఈసారి 'చి ల సౌ'తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి చేసిన సినిమా ఇది. నాగ్‌ కెరీర్‌లో కల్ట్‌ మూవీగా నిలిచిన 'మన్మథుడు' టైటిల్‌ వాడుకోవడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. దీని టీజర్‌ - ట్రైలర్‌ కూడా ఆకట్టుకున్నాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.
 
కథ:
సాంబశివరావు ఉరఫ్‌ శ్యామ్‌ (నాగార్జున) పెళ్లి అంటే భయపడే నడి వయసు వ్యక్తి. యుక్త వయసులో ప్రేమలో పడి దెబ్బ తిన్న అతను అమ్మాయిలతో దీర్ఘకాలిక బంధాన్ని కోరుకోడు. అమ్మాయిలతో సరదాలు కోరుకుంటాడు. కానీ శ్యామ్‌ తల్లి, అక్కాచెల్లెళ్లు మాత్రం అతడికి పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. తల్లి బాధ చూడలేక అవంతిక (రకుల్‌ ప్రీత్‌) అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు నాటకం మొదలుపెడతాడు శ్యామ్‌. కానీ అవంతిక ఈ కుటుంబంలోకి వచ్చాక శ్యామ్‌ ఊహించని పరిణామాలు జరుగుతాయి. అవేంటి అవంతిక సాయంతో శ్యామ్‌ ఆడాలనుకున్న నాటకం రక్తికట్టిందా లేదా? చివరికి శ్యామ్‌ పెళ్లి చేసుకున్నడా లేదా అన్నది మిగతా కథ.
 
విశ్లేషణ:
'మన్మథుడు'కి.. 'మన్మథుడు-2'కి టైటిల్‌ మినహా కథంతా విరుద్ధంగా వుంటుంది. అందులో అమ్మాయిలంటే ఇష్టంలేనివాడు. ఇందులో అమ్మాయిలంటేనే ఇష్టం. కానీ జీవితభాగస్వామి కాకుండా టైంపాస్‌గా వారితో సరసాలాడి వదిలేయడం. అలాంటి వాడిని ఓ అమ్మాయి ఏవిధంగా మార్చింది? ఆయన కుటుంబసభ్యుల మెప్పు ఎలా పొందింది? అనేది కథ. 
 
ఇది బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలనుంచి చూసిన కథనే. బ్యాక్‌డ్రాప్‌ మాత్రం పోర్చుగీస్‌ సినిమాలోని థ్రెడ్‌ అంటూ ప్రచారం చేశారు. ఇంతోటి కథను ఇక్కడ చేయవచ్చనే ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఎవరో కొత్తగా సినిమా తీసేవారు అంటే ప్రచారం బాగా చేయాలి. దాని వల్ల థియేటర్‌కు ప్రేక్షకుడు వస్తాడు. కానీ ఒక ఇమేజ్‌ వుండికూడా కేవలం థియేటర్‌కు రాణించడానికి టైటిల్‌ పెట్టినట్లుంది మినహా ఏమాత్రం ఆమోదయోగ్యమైన కథ కాదు. 
 
ఈ విషయంలో సీనియర్‌ హీరోలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు వర్మతో 'ఆఫీసర్‌' చిత్రాన్ని తీసి భంగపడ్డాడు. అంతా వర్మకే వదిలేశానని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి మన్మథుడు2 చిత్రం అలాకాదు. తనే ఫ్రెండ్‌ సినిమా చూసి రాహుల్‌ను చూడమని.. మరీ సినిమా స్వంతబేనర్‌తోపాటు మరో ఇద్దరు నిర్మాతలతో నిర్మించాడు.  
 
ఈ కథ ఫ్రెంచ్‌ నవల ఆధారంగా తెరకెక్కింది. దాన్ని తెలుగులో అటూఇటూ మార్చి రీమేక్‌ చేశారు. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి చాలానే చూశామనే ఫీలింగ్‌ మాత్రం స్పష్టంగా కలుగుతుంది. హీరో వెన్నంటి చివరి వరకు వున్న వెన్నెల కిశోర్‌ చిత్రానికి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌. అసలు హీరో వెన్నెల కిశోరేమో అన్నంత ఆయన పాత్ర వుంది. ఎందుకంటే తను ప్రేమించిన అమ్మాయిని నాగార్జున తన ఇంటికి వచ్చేలా చేస్తాడు.
 
ఇక ఇతర పాత్రల్లో సీనియర్‌ నటి లక్ష్మి అద్భుతంగా నటనలో షేడ్స్‌ పండించింది. ఆమె కుమార్తెలుగా నటించిన ముగ్గూరు పర్వాలేదు. కొన్ని సన్నివేశాలు వస్తుంటే 'ఇది మన సినిమా' అనే ఏ కోశాన అనుకునేలా చేయలేకపోయారు. పూర్తిగా పోర్చుగల్‌ లోనే సాగిపోయే ఈ సినిమాలో నేటివిటీ ఫ్యాక్టర్‌ పూర్తిగా మిస్సయింది. ఇక్కడ కథ విదేశీ నేపథ్యంలో నడిచింది కాబట్టే దాంతో కనెక్ట్‌ కాలేం అన్నట్లు కాదు. 
 
హీరో శృంగారపురుషుడు. ఇంట్లో రాముడుగా బిహేవ్‌ చేస్తాడు. చాలా వరకు ద్వంద్వార్థాల డైలాగ్‌లు, సన్నివేశాలు వున్నాయి. అందులోకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా సింక్‌ చేయడానికి ప్రయత్నించాడు రాహుల్‌.
 
పెళ్లి కోసం ఓ అగ్రిమెంట్‌ రాయించుకుని ఇంట్లో పోరు తట్టుకోలేక ఓ అమ్మాయిని తీసుకొచ్చి డ్రామా ఆడే కథలు కూడా బోలెడన్ని మనదగ్గర ఉన్నాయి. అంత విశేషంగా ప్రత్యేకంగా అనిపించే అంశాలేవీ కూడా 'మన్మథుడు-2'లో కనిపించవు. హీరోయిన్‌ రంగప్రవేశంతో ఇంకా ఊపందుకోవాల్సిన కథనం.. ఆశ్చర్యకరంగా నీరసించిపోతుంది. హీరోయిన్‌ తో హీరో ఒప్పందం.. పెళ్లి డ్రామా.. అన్నీ కూడా కత్రిమంగా అనిపిస్తాయి. 
 
ఏ కొత్తదనం లేని సన్నివేశాలతో 'మన్మథుడు-2' మొదలైన అరగంట నుంచే బోర్‌ కొట్టించడం మొదలుపెడుతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సైతం తేలిపోయింది. ద్వితీయార్ధంలో దాదాపు స్లోగా కథనం నడుస్తుంది. రావు రమేష్‌ పంచులే లేకుంటే పరిస్థితి ఘోరంగా తయారయ్యేదే. వాళ్ల కామెడీ కొంచెం రిలీఫ్‌ ఇస్తుంది తప్పితే.. సినిమా మీద ఆసక్తిని మాత్రం పెంచదు.
 
చివరికి ఓ మోస్తరుగా అనిపించే ముగింపుతో 'మన్మథుడు-2' అయ్యిందంటే అయ్యిందనిపిస్తుంది. సినిమాలో ఒక చోట బ్రహ్మానందం కూడా మెరిశాడు. 'మన్మథుడు'లో హిలేరియస్‌ గా అనిపించిన ఎస్కలేటర్‌ ఎపిసోడ్‌ కు కొనసాగింపుగా చిన్న కౌంటర్‌ ఉందీ చిత్రంలో. ఆ సీన్‌ దగ్గర ఒక్కసారిగా 'మన్మథుడు'కు సంబంధించిన ఊహల్లోకి వెళ్లిపోతాం. అప్పుడు కానీ అర్థం కాదు.. మనం చూస్తున్నది 'పేరు గొప్ప..' సినిమా అని.
 
వయసుకు తగ్గ పాత్రే చేసినప్పటికీ ఆయన ప్రేక్షకుల్ని సంత ప్తి పరచడంలో మాత్రం విఫలమయ్యాడు. రకుల్‌ ప్రీత్‌ బోల్డ్‌ లుక్స్‌.. యాక్టింగ్‌ తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్‌ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. కానీ పాత్ర తేలిపోవడంతో రకుల్‌ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. సీనియర్‌ నటి లక్ష్మి కొన్ని సన్నివేశాల్లో తన అనుభవాన్ని చూపించింది. 
 
వెన్నెల కిషోర్‌.. రావు రమేష్‌ తమ వంతుగా బాగానే వినోదం పంచారు. ఝాన్సీ.. దేవదర్శిని.. నిశాంతి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. మిగతా నటీనటులంతా ఓకే.  చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం నిరాశ పరుస్తుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. సుకుమార్‌ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. పోర్చుగల్‌ నగరాన్ని బాగా చూపించాడు. విజువల్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. 
 
ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కు ఢోకా లేదు. సినిమా రిచ్‌‌గా తెరకెక్కింది.  ఓ పక్క అడల్ట్‌ కంటెంట్‌ దట్టించి.. ఇంకో పక్క ఫ్యామిలీ ఎమోషన్స్‌ మీదా ఫోకస్‌ పెట్టడంతో సినిమా రెంటికీ చెడ్డట్లు తయారైంది. అందుకే ఇమేజ్‌ వున్న ఆర్టిస్టులు కథల్ని సరిగ్గా సెలక్‌ చేసుకోవాలనిపిస్తుంది. 
 
కలెక్షన్లు ఎలా వున్నాయంటే?
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మన్మథుడికి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో పాటు కలెక్షన్లు కూడా తగ్గుముఖం పడ్డాయి. నాగార్జున నటించిన మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడాన్ని అక్కినేని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.