శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:59 IST)

బాలు కోలుకుని ఆ గళం విప్పాలి.. కోటి రాగాలు తీయాలి.. చిరంజీవి (Video)

కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇదే అంశంపై ఆయన మగళవారం రాత్రి 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 
 
బాలు ఆరోగ్యంగా బయటికి రావాలని కోట్లాది మంది ఆయనకోసం ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని తెలిసి సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ ద్వారా బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా చిరంజీవి తన వీడియోలో పేర్కొన్నారు. ఇంకా ఆ వీడియోలో... 
 
'కోటానుకోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమానులు ఎస్.పి. బాలు.. రోజురోజుకీ కోలుకుంటున్నారని, వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. బాలుతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు.. కుటుంబపరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. 
 
చెన్నైలో పక్కపక్క వీధుల్లో ఉంటూ తరుచూ కలుసుకునే వాళ్లం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం మాది. తనని అన్నయ్యా అంటూ నేను ఆప్యాయంగా పిలుస్తుంటాను. అలాగే ఆయన చెల్లెళ్లు ఎస్.పి.వసంత, శైలజ కూడా నన్ను అన్నయ్యలాగే చూసుకుంటారు. బాలు ఆరోగ్య పరిస్థిని గత మూడు రోజులుగా వసంత, శైలజ, శుభలేఖ సుధాకర్‌లతో మాట్లాడి తెలుసుకుంటూనే ఉన్నాను. 
 
ఈ రోజు కూడా తన ఆరోగ్యం గురించి వారితో మాట్లాడాను. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్పిన మాట నాకు ఎంతో తృప్తినిచ్చింది. రోజురోజుకి ఆరోగ్యం మెరుగవుతుందనే మాటలు నాకు చాలా సంతోషాన్నిచ్చాయి. బాలు తెలుగు సినిమాకి ఓ అద్భుతం. ఆ మాటకొస్తే.. భారతీయ సినిమాకు ఆయన ఊపిరే రాగం, తానం, పల్లవి. త్వరగా కోలుకుని, ఆ గళం విప్పాలని, కోటి రాగాలు తీయాలని, భారతీయులందరినీ ఉర్రూతలూగించాలని, అలరించాలని, ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేనూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. 
 
అందరి ప్రార్థనలు, ఆ దేవుడి ఆశీస్సులు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తుంది. త్వరగా బాలు మనముందుకు వచ్చి, రెట్టింపు ఉత్సాహంతో మరింతగా అలరించాలని, ఆహ్లాదపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కోసం మనం అందరి కలిసి ఆ భగవంతుడిని వేడుకుందాం..' అని చిరంజీవి తన ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
కాగా, చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.పి.బాలు ఆరోగ్యం విషమంగా ఉందనీ, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నార‌ని ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్, అలాగే ఎంజీఎం హాస్పిటల్స్ వైద్య సిబ్బంది తెలుపుతున్నారు.