శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (13:02 IST)

మనీలాండ‌రింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట

Jacqueline Fernandez
Jacqueline Fernandez
మనీలాండ‌రింగ్ కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కాస్త ఊర‌ట ల‌భించింది. రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆమెకు సోమ‌వారం మ‌ధ్యంత‌ర బెయిల్ ల‌భించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ. 50 వేల పూచిక‌త్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ కేసు‌లో ప్ర‌ధాన నిందితుడిగా జైల్లో ఉన్న‌ సుఖేశ్‌ చంద్ర‌శేఖ‌ర్ నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్న జాక్వెలిన్‌పై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఆమెను రెండుసార్లు విచారించారు. ఆమె ఆర్థిక లావాదేవీల‌పై విచార‌ణ చేప‌ట్టారు. బాలీవుడ్ న‌టికి సుకేశ్ రూ. 7కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. 
 
జాక్వెలిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖ‌రీదైన కార్లు, బ్యాగులు, దుస్తులు, గడియారాలను కూడా ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈడీ విచార‌ణ‌లో ఈ విష‌యాల‌ను జాక్వెలిన్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో, ఈ కేసులో ఆమె పేరు కూడా చేర్చిన ఈడీ.. అనుబంధ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. 
 
ఈ ఛార్జిషీట్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం సోమ‌వారం కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఈ కేసుపై త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 22వ తేదీకి వాయిదా వేసింది.