శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:42 IST)

మనీలాండరింగ్ కేసులో రక్కమ్మకు ఊరట... మధ్యంతర బెయిల్ మంజూరు

Jacqueline Fernandez
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు భారీ ఊరట లభించింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు సోమవారం ఢిల్లీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ కేస‌లో ప్ర‌ధాన నిందితుడిగా జైల్లో ఉన్న‌ సుఖేశ్‌ చంద్ర‌శేఖ‌ర్ నుంచి ఖ‌రీదైన బ‌హుమ‌తులు అందుకున్న జాక్వెలిన్‌పై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌ను రెండుసార్లు విచారించారు. 
 
ఆమె ఆర్థిక లావాదేవీల‌పై విచార‌ణ చేప‌ట్టారు. బాలీవుడ్ న‌టికి సుఖేశ్ రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడు. జాక్వెలిన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఖ‌రీదైన కార్లు, బ్యాగులు, బట్టలు, గడియారాలను కూడా ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. 
 
పైగా వీటన్నింటినీ సుఖేశ్ చంద్ర నుంచి తీసుకున్నట్టు జాక్వెలిన్ అంగీకరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. దాంతో, ఈ కేసులో ఆమె పేరు కూడా చేర్చిన ఈడీ.. అనుబంధ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది. ఈ ఛార్జిషీట్‌ను ప‌రిశీలించిన న్యాయ‌స్థానం సోమ‌వారం కోర్టు ఎదుట హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. 
 
దాంతో, పాటియాలా కోర్టుకు వ‌చ్చిన జాక్వెలిన్ మ‌ధ్యంత‌ర బెయిలు కోసం ద‌ర‌ఖాస్తు చేసింది. రెగ్యుల‌ర్ బెయిల్ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో ఆమెకు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని ఆమె తరపు న్యాయ‌వాది కోరారు. దీనికి పాటియాలా కోర్టు అంగీక‌రించి బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది.