గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (12:24 IST)

కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న నటి నగ్మాకు పాజిటివ్

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, పలు రకాలైన టీకాలను తయారు చేయించి, వాటిని ప్రజలకు వేస్తున్నాయి. దీంతో అనేక మంది ఈ టీకాలను వేయించుకుంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా ఈ వైరస్ సోకుతోంది. తాజాగా సినీ నటి నగ్మాకు కరోనా పాజిటివ్ అని తేలింది. పైగా, ఈమె తొలి డోస్ కరోనా టీకా వేయించుకున్నారు కూడా. 
 
కొద్ది రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా వచ్చినట్లు ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 'కొద్ది రోజుల ముందే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నా. టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండిపోయా. అందరూ భద్రంగా ఉండండి. తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి వ్యాక్సిన్ డోస్ తీసుకోగానే నిర్లక్ష్యంగా ఉండకండి అని నగ్మా ట్వీట్ చేశారు.
 
కాగా, నగ్మా తన తొలి డోస్‌ను ఏప్రిల్ 2న తీసుకున్నారు. అది తీసుకున్న కొద్ది రోజుల తర్వాత జ్వరం, దగ్గు, జలుబు వచ్చాయట. అప్పుడు కూడా ఆమె ట్విట్టర్లో ఇలా రాసుకొచ్చారు. ‘నేను తొలి డోసు తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి బాడీ టెంపరేచర్ పెరిగినట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి, జలుబు, దగ్గుగా ఉన్నాయి, కళ్లు మండుతున్నాయి. ప్రస్తుతం రెండ్రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇపుడు ఆమెకు కరోనా వైరస్ సోకింది.