కోహ్లీసేనకు కరోనా షాక్ - డేనియెల్ సామ్స్‌కు పాజిటివ్
మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే, ఈ సమరానికి ఆయా ఫ్రాంచైజీలకు చెందిన జట్లు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఈ టోర్నీని కరోనా వైరస్ వెంటాడుతోంది. తాజాగా మరో ఆటగాడికి కొవిడ్-19 సోకింది. ఆల్‌రౌండర్ డేనియెల్ సామ్స్‌కు పాజిటివ్ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది.
ఆస్ట్రేలియా ఆటగాడైనా డేనియెల్ సామ్స్ ఏప్రిల్ 3న నెగెటివ్ రిపోర్టుతో బెంగళూరు శిబిరానికి చేరుకున్నాడు. అతడికి చేసిన రెండో పరీక్షలో పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే బీసీసీఐ కొవిడ్-19 నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు పంపించామని ఆర్‌సీబీ తెలియజేసింది.
కఠినమైన ఆంక్షలను పాటిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రస్తుతం సామ్స్‌కు ఎలాంటి లక్షణాలు లేవంది. తమ వైద్య బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోందని, బీసీసీఐతో సహకరిస్తోందని ట్వీట్ చేసింది.
ఐపీఎల్‌కు మరో రెండురోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ఇతర జట్ల ఆటగాళ్లు కరోనా బారినపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్, బెంగళూరులోనే దేవదత్ పడిక్కల్‌కు పాజిటివ్ వచ్చింది. మళ్లీ నెగెటివ్ రావడంతో పడిక్కల్ శిబిరంలోకి వచ్చేశాడు.
కోల్‌కతా ఆటగాడు నితీశ్ రాణె కొవిడ్ నుంచి కోలుకొని జట్టుతో కలిశాడు. ముంబై ఇండియన్స్ సలహాదారు కిరణ్ మోరెకు సోమవారమే వైరస్ సోకింది. అలాగే, ప్రారంభ మ్యాచ్ జరిగే ముంబైలోని వాంఖడే మైదానం సిబ్బంది పదుల సంఖ్యలో వైరస్ సోకింది. అంతేకాకుండా మ్యాచులను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్ సిబ్బందిలో చాలామందికి పాజిటివ్ రావడంతో మ్యాచులపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది.