నాని ఋగ్వేదాన్ని కించపరిచాడు - స్వామీజీలు ఆగ్రహం
నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరో నాని ఋగ్వేదాన్ని చులకనగా మాట్లాడాడని హిందూ స్వామీజీలు కోపంగా వున్నారు. గత రెండు రోజులుగా ఫేస్‌బుక్‌లో ఈ సినిమాపై కాంట్రవర్సీ నడుస్తుంది. చాలామంది ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ను బేస్ చేసుకుని దర్శకుడు, హీరో ఎందుకు ఇలా చేశారు? అదే వేరే మతం గురించి ఇలా మాట్లాడే దమ్ముందా! అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలు సినిమాలో ఏముందంటే, నాని ఈ సినిమాలో కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తి. కులం, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా రచయితగా చైతన్యవంతుల్ని చేస్తాడు. అలా ఓసారి తన ఊరిలో ఓ బావి దగ్గరకు రాగానే అక్కడ నీరు తాగడానికి బావిలో తోడుకోవడానికి నిమ్నజాతివారు ఎదురుచూస్తుంటారు . కానీ అక్కడ బ్రాహ్మణ కులంకు చెందిన పెద్దలు వారిని బావి వరకు రానీయరు. అసలు వారు బావిని ముట్టుకుంటే బావి అంటరానిదై పోతుందని వారి వాదన. ఆ సందర్భంలో హీరో నాని వచ్చి వారిచేత నీళ్ళు పట్టించబోతే అగ్ర బ్రాహ్మణులు గట్టిగా వారిస్తారు.
ఆ సందర్భంలో నాని మాట్లాడిన మాటలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఓ పెద్దాయన దగ్గరకు వచ్చి, కులం కాళ్ళు పట్టుకుని వేలాడటానికి ఇది ఋగ్వేదకాలం కాదు. స్వతంత్ర భారతం అంటూ ఆ వ్యక్తికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పటికీ వారు వినరు. ఆ సమయంలో ఓ నిగ్నజాతివ్యక్తిని బావిలో విసిరేస్తాడు నాని. ఇప్పుడు నీరు ఎలా తాగుతారో తాగండి అంటూ వార్నింగ్ ఇచ్చి నాని వెళ్లిపోతాడు..
ఇది సినిమాలో సీన్. ఇందులో నాని ఋగ్వేదం గురించి పలికిన మాటలు కొందరి హిందూ స్వామీజీలను తట్టిలేపాయి. వారంతా ఫేస్‌బుక్‌లో ఋగ్వేదం అనేది అంటరానితనాన్ని ప్రోత్సహించేదిగా చూపించారంటూ తప్పుపట్టారు. అంతేకాక నాలుగు వర్ణాలు ఎలా పుట్టాయో విశదీకరిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. పురుష సూక్తంలో ఒకే ఒకచోట కులాల గురించి చెప్పబడింది అంటూ స్వామీజీలు వివరించారు.
హిందూ మతాన్ని అందరూ వేలెత్తి చూపిస్తుంటారు. పలానా గ్రంథంలో ఉగ్రవాదం, బానిసత్వం ప్రేరేపించిందని చెప్పగలరా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదంపై ఎవరూ కోర్టుకు వెళ్లలేదు. మరి దీనిపై దర్శకుడు, హీరో ఎలా స్పందిస్తారో చూడాలి.