1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:34 IST)

హీరో సిద్ధార్థ్ సీఎం స్టాలిన్, పీఎం మోడీల‌ను అనుంటాడు...

సినిమా టికెట్ల ధరలపై హీరో నాని, సిద్దార్థ్‌లకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  మాట్లాడేవాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సెప్టెంబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌లు, ఎగ్జిబిటర్లుతో సమావేశం పెట్టాం. ఆ రోజే సినిమా హాళ్ల యజమానులు అనుమతులు, ఫైర్‌ ఎన్‌ఓసీ కానీ తీసుకోవడం లేదు. వీటిని రెన్యువల్‌ చేసుకోమని ఆనాడే చెప్పాం. అయినా అనుమతులు లేకుండా నడిపారు. అనుమతులు తీసుకోని థియేటర్లపైనే చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎవరి మీదనో కక్ష ఎందుకు ఉంటుంద‌ని మంత్రి పేర్నినాని ప్ర‌శ్నించారు.
 
 
ఏపీలో 130 సినిమా హాళ్ల పై చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్లే.  చిత్తూరులో 24, కృష్ణా జిల్లా లో 12 సీజ్ చేశాం. లైసెన్స్ లేని వాళ్ళు 22 థియేటర్లు మూసేశారు. 83 సీజ్ చేశాం, 23 థియేటర్లపై ఫైన్ వేశాం. జీవో 35ని ఏప్రిల్‌లో ఇచ్చాం. మరి ఈ రోజు ఆ జీవోకి నిరసనగా మూసివేయడానికి నాని ఏ ఊరులో ఉన్నారో.. ఆయన ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో తెలియదని మంత్రి ఎద్దేవా చేశారు.
 
 
మరో నటుడు సిద్దార్థ్ ఎక్కడుంటారు? ఆయన చెన్నై లో స్టాలిన్ కోసం మాట్లాడారేమో. సిద్దార్థ్ ఏమైనా ఇక్కడ టాక్స్‌లు కట్టాడా. మా ఇళ్లకి వచ్చి చూసాడా? మేం ఎంత విలాసంగా ఉంటున్నామో. ఆయన స్టాలిన్ కోసమో, మోడీ కోసమో అనుంటాడు. ఎవరి కోసమో మేం నిర్ణయాలు తీసుకోం. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. మేం హైకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటున్నాం. ఎవరితోనైనా ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య అయినా వినడానికి మేం సిద్ధం. ప్రభుత్వానికి ఏదో అపాదించి మాట్లాడటం ధర్మం కాదు' అని మంత్రి పేర్ని నాని అన్నారు.