"నేనేం చెయ్య..` అంటోన్న జగపతిబాబు
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగానే కాకుండా నృత్యం చేశాడు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా నటించిన 'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకుడు. బేబి సహశ్రిత మరో కీలక పాత్రధారి.
రీల్ హీరోలకు బదులు రియల్ హీరోలతో 'ఎఫ్‌సీయూకే' పాటలను విడుదల చేయించాలని నిర్ణయించుకున్న చిత్ర బృందం, అందులో భాగంగా కొవిడ్ 19 మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే "ముఝ్‌సే సెల్ఫీ లేలో.." అంటూ సాగే తొలి పాటను ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
తాజాగా బుధవారం "నేనేం చెయ్య.." అంటూ సాగే రెండో పాటను ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు విడుదల చేయడం గమనార్హం. లాక్‌డౌన్ టైమ్‌లో కొవిడ్ నుంచి ప్రజలను కాపాడటంలో నిరంతరాయంగా పనిచేసి, ఒకవైపు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూస్తూ, మరోవైపు ఆరోగ్యసేవలు అందిస్తూ వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనే చిరు ప్రయత్నంతోటే "నేనేం చెయ్య.." పాటను వారి చేత విడుదల చేయించింది చిత్ర బృందం.
ఈ పాటను సినిమాలో జగపతిబాబుపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు "నేనేం చెయ్య.." పాటను విడుదల చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాననీ, ఈ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారనీ అన్నారు.
త్వరలో మరో రెండు పాటలను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుదల చేస్తామని నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు విద్యాసాగర్ రాజు తెలిపారు.