శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (17:21 IST)

ఈ తరానికి నచ్చేలా కథలు ఉండాలి : పంజా వైష్ణవ్ తేజ్

Panja Vaishnav Tej
Panja Vaishnav Tej
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.
 
ఆదికేశవ ప్రయాణం ఎలా మొదలైంది?
రంగ రంగ వైభవంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ గారు ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే నాకు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చింది.
 
మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడం కోసం ఈ సినిమా చేశారా?
అలాంటి ఉద్దేశం లేదు. కథ నచ్చి చేశాను. నాకు తెలిసినదల్లా కష్టపడి నిజాయితీగా పని చేయడమే.. ఫలితం గురించి ఆలోచించి ఏదీ చేయను. నా మొదటి సినిమా ఉప్పెన కూడా అలాగే చేశాను. నాకు ముందు కథ నచ్చాలి. ఎవరైనా అడిగినా కూడా నేను హీరోని కాదు, నటుడిని అనే చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో, నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.
 
కథలో మీకు నచ్చిన అంశం ఏంటి?
ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు.
 
యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి?
యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పది మంది గాలిలో ఎగరడం అలాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి.
 
శ్రీలీల గారితో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?
నేనసలు డ్యాన్సర్ ని కాదు(నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను.
 
ఆదికేశవలో దైవత్వం ఉంటుందా?
ఓ పది శాతం అలా శివుడి గురించి ఉంటుంది. అది కథలో భాగమై ఉంటుంది.
 
దర్శకుడు శ్రీకాంత్ గురించి?
కథ చెప్పినప్పుడు నాకు ఎంత బాగుంది అనిపించిందో.. దానిని అంతే అద్భుతంగా ఆయన తెరకెక్కించారు.
 
జోజు జార్జ్ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
జోజు జార్జ్ గారు చలా స్వీట్ పర్సన్. ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు విజయ్ సేతుపతి గారిని చూసినట్లే అనిపించేది. ఆయన భోజన ప్రియుడు. ఫలానా చోట ఫుడ్ బాగుంటుంది అంట కదా అని అడిగేవారు. అంత పెద్ద యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయినప్పటికే డౌన్ టు ఎర్త్ ఉంటారు.
 
శ్రీలీలతో మీ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి?
నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి సన్నివేశాలు.
 
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ గురించి?
జి.వి. ప్రకాష్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మెలోడీ అయినా, మాస్ బీట్ అయినా ఏదైనా ఇవ్వగలరు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇస్తారు. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఎప్పుడూ పని గురించే మాట్లాడుతూ ఉంటారు.
 
రాధిక గారి గురించి?
అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది.
 
మీరు నటించిన ఉప్పెనకి, అలాగే అల్లు అర్జున్ కి జాతీయ అవార్డులు రావడం ఎలా అనిపించింది.
బన్నీకి అవార్డ్ రావడం గర్వంగా అనిపించింది. అలాగే ఉప్పెన విషయంలో చాలా సంతోషం కలిగింది. అందరి కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనిపించింది.
 
కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఖచ్చితంగా కథలో కొత్తదనం ఉండాలి. అలాగే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను. ఈ తరానికి నచ్చేలా ఉండాలి.