శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (15:30 IST)

ప్రఖ్యాత థియేటర్‌లో ప్రభాస్ "సాహో" ప్రదర్శన

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ తాజా చిత్రం సాహో. ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డులను నెలకొల్పుతోంది. సుమారు రూ.250 నుంచి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. 
 
అయితే, ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత థియేటర్‌ గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. పారిస్‌లోని ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది.
 
ఇప్పటికే సౌత్‌ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్‌, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. అద్భుతమైన ఇంటీరియర్‌లో అత్యాధునిక సదుపాయాలున్న ఈ థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు అవకాశం దక్కటం గౌరవంగా భావిస్తారు. 
 
ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్‌ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది.