మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:59 IST)

సాహో విడుదల... గంట వ్యవధిలో ఆన్‌లైన్‌లో రిలీజ్

ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సాహో. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. అయితే, ఈ చిత్ర యూనిట్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. 
 
సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ చిత్రం ఆన్ లైన్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సైట్ ఈ చిత్రాన్ని లీక్ చేసింది. హైక్వాలిటీ ఉన్న 'సాహో' చిత్రం ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని బాలీవుడ్ లైఫ్ డాట్ కామ్ వెల్లడించింది. 
 
తమిళ్ రాకర్స్ ఓ చిత్రాన్ని లీక్ చేయడం ఇదే తొలిసారి కాదు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, రజనీకాంత్ తదితర సూపర్ స్టార్లంతా ఈ వెబ్ సైట్ బారిన పడినవారే. బాలీవుడ్ మూవీలను సైతం ఈ వెబ్ సైట్ లీక్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
 
మరోవైపు. ఈ చిత్రం రివ్యూను ఓసారి పరిశీలిస్తే, 
 
నిర్మాణ సంస్థ  : యువి క్రియేషన్స్
నటీనటులు : ప్రభాస్, శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్‌లిన్ శ‌ర్మ‌, చుంకీపాండే, లాల్‌, మందిరాబేడి తదితరులు. 
సంగీతం: త‌నిష్క్ బ‌గ్చి, గురురంద్వా, బాద్షా, శంక‌ర్ ఎహ్‌సాన్‌లాయ్‌
బ్యాగ్రౌండ్ స్కోర్‌: జిబ్రాన్‌
నిర్మాత‌లు: వంశీ, ప్ర‌మోద్‌
ద‌ర్శ‌క‌త్వం: సుజిత్‌
 
తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ప్రభాస్ హీరో కాగా, రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు భాగాలు రికార్డులను తిరగరాసింది. అలాంటి బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం సాహో. యువ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్. యూవీ క్రియేషన్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని సుమారుగా రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
బాహ‌ుబ‌లితో ప్ర‌భాస్ రేంజ్ అంత‌ర్జాతీయ స్థాయికి చేర‌డంతో నిర్మాత‌లు సాహోను ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించారు. బాలీవుడ్ తార‌లు, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ఈ సినిమాకు ప‌నిచేయ‌డం, బాహుబ‌లి ఇమేజ్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చాయి. మ‌రి సాహో ఈ అంచ‌నాల‌ను అందుకుందా? లేదా? ప‌్ర‌భాస్ ఇమేజ్ పెరిగిందా? లేదా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం.
 
కథ : 
దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో భారీ దొంగతనం జరుగుతుంది. రెండు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఓ దొంగ చిన్న సాక్ష్యం కూడా దొరక్కుండా కొట్టేస్తాడు. కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ డేవిడ్‌ (ముర‌ళీశ‌ర్మ‌), కానిస్టేబుల్ గోస్వామి (వెన్నెల‌కిషోర్‌) దొంగెవ‌రో తెలుసుకునే ప్రయత్నంలో విఫలమవుతారు. దీంతో ప్ర‌భుత్వం ఓ స్పెష‌ల్ ఆఫీస‌ర్ అశోక్ చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)ను నియ‌మిస్తుంది. అశోక్ కేసుని ఛేదిస్తుండగా చివ‌ర‌కు జై(నీల్ నితిన్ ముఖేష్‌)నే ఆ దొంగ అని తెలుస్తుంది. అయితే జైకు పోలీసుల నుంచి సమాచారం వ‌స్తుండ‌టంతో త‌ప్పించుకుంటూ ఉంటాడు.
 
జైనే అస‌లు దొంగ అని సాక్ష్యాల‌తో ప‌ట్టుకోవాలంటే ఏదో ఒక‌టి చేయాల‌ని.. అత‌నితో స్నేహం చేయ‌డానికి హీరో అత‌నుండే ప‌బ్‌కి వెళ‌తాడు. అదే స‌మ‌యంలో అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌)కి డ్యూటీ వేస్తాడు. ఈ క్రమంలో ఆమెపై అశోక్ ప్రేమలో పడుతాడు. ఓసారి తాగిన మైకంలో జై ఓ క్లూ అశోక్‌కు ఇస్తాడు. వాజీ న‌గ‌రంలో ఉండే బ్లాక్ బాక్స్‌లో కోట్ల రూపాయ‌లున్నాయని అది ద‌క్కితే తానే అదృష్ట‌వంతుడిన‌ని, అందుకోసం తాను ప్ర‌యత్నిస్తున్న‌ట్లు చెబుతాడు. ఆ బ్లాక్ బాక్స్ దొంగ‌త‌నం చేసే క్ర‌మంలో అత‌న్ని రెడ్ హ్యాండ్‌గా ప‌ట్టుకోవాల‌ని ప్ర‌భాస్ పోలీసుల‌తో క‌లిసి ప్లాన్ చేస్తాడు.
 
ఇంతలో సిటీలో పెద్ద డాన్ రాయ్‌(జాకీ ష్రాఫ్‌)ను కొంద‌రు చంపేస్తారు. ఆయ‌న స్థానంలో డాన్ అయిన ఆయ‌న త‌న‌యుడు విశ్వాంక్‌(అరుణ్ విజ‌య్‌) తండ్రిని చంపిన వారిని ప‌ట్టుకోవ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అనుకోని షాకింగ్ విష‌యాలు రివీల్ అవుతూ వ‌స్తాయి. అస‌లు అశోక్ ఎవ‌రు? అత‌నికి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న సంబంధాలు ఏంటి? అస‌లు బ్లాక్ బాక్స్ ర‌హ‌స్య‌మేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
కథా విశ్లేషణ : 
"బాహుబ‌లి" త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెర‌గ‌డంతో సాహోపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ అంచనాల‌కు త‌గ్గ‌ట్లే నిర్మాతలు, హీరో, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భారీ బ‌డ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో సాహో సినిమాను రూపొందించారు. రాజ‌మౌళి వంటి ద‌ర్శ‌కుడి త‌ర్వాత సుజిత్ వంటి ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ సినిమా చేయ‌డ‌మంటే.. నిజంగా అత‌ని తెగువకు అభినందించాల్సిందే. 
 
అయితే ఈ అంచ‌నాల కార‌ణంగా సాహో భారతీయ చిత్రం అనే అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వ‌స్తాడ‌న‌డంలో సందేహం లేదు. ఈ అంచ‌నాల‌కు ధీటుగా సినిమా ఉండాలి. దీని వ‌ల్ల సినిమాలో సాంకేతిక హంగులు పెరిగాయి. దీంతో సినిమా బాలీవుడ్ రంగు పులుముకున్న‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తుంది. యాక్ష‌న్ డ్రామా.. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌ను చిత్రీక‌రించారు.
 
ఎంత పెద్ద భారీ చిత్ర‌మైనా ఓ భావోద్వేగం కూడా చాలా ముఖ్యం. ఈ ఎమోష‌న్ పార్ట్ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా, క‌నెక్టింగ్‌గా ఉండ‌దు. సినిమా ప్ర‌థ‌మార్థం అంతా నెమ్మదిగా సాగుతోంది. అయితే అదంతా క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నాల‌ని అర్థం చేసుకోవాలంటే, విశ్రాంతి ట్విస్ట్ తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో వ‌రుస ట్విస్టులతో షాకులిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. ఈ షాకుల వ‌ల్ల ప్రేక్ష‌కుడు గందరగోళానికి లోనవుతాడు. ప్లాష్ బ్యాక్ పార్ట్‌ను మిక్స్ చేసి చూసిన త‌ర్వాత ఇది రివేంజ్ డ్రామానా అనిపిస్తుంది. సినిమాలో యాక్ష‌న్ పార్ట్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నా.. వాటిని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గ‌ట్లు న‌చ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పొచ్చు. 
 
ప్ర‌భాస్ యాక్ష‌న్ సన్నివేశాల్లో అద్భుతంగా చేశాడు. అయితే, ఎవ‌రితో, ఎందుకు చేస్తున్నాడ‌నే గందరగోళం నెలకొంటుంది. ప్ర‌తి విష‌యంలో ట్విస్ట్‌, థ్రిల్లింగ్ ఇవ్వాల‌నే త‌లంపుతో ప్ర‌తి విష‌యాన్ని దాచి పెట్ట‌డం.. చివ‌ర‌కు రివీల్ చేయ‌డంతో కాస్త తిక‌మ‌క‌గా త‌యారైంది. సినిమాలో కామెడీ పార్ట్ ఉన్న‌దే అనుకుని సంతృప్తిపడాలి. 
 
ఇక నటీన‌టులప‌రంగా చూస్తే ప్ర‌భాస్ గురించి మ‌నం త‌క్కువ చేయ‌లేం. బాహుబ‌లితో అతనేంటో మరోమారు నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో న‌టుడిగా చాలా రిస్కుల‌తో న‌టించాడు. అలాగే శ్ర‌ద్ధాక‌పూర్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ అద్భుతంగా ఉంది కానీ.. హిందీ పాట‌ల్లా అనిపిస్తాయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. మ‌ది కెమెరా వ‌ర్క్ సూపర్బ్. యాక్ష‌న్ ఎలిమెంట్స్ సూప‌ర్బ్‌. ఇత‌ర న‌టీన‌టులంద‌రూ వారివారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.