శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (11:44 IST)

"సాహో" స్టోరీ లీక్?! ... ద్విపాత్రాభినయంలో ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "సాహో". ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ కాగా, సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‍‌తో నిర్మించింది. పైగా, 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలో నెలకొన్నాయి. 
 
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు సాంగ్స్ ప్రోమోస్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఇదే 'సాహో' సినిమా కథంటూ ఓ స్టోరీలైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ సినిమా కథ ప్రధానంగా రెండు వేల కోట్ల దొంగతనం చుట్టూ నడుస్తుంది. ఆ దొంగతనం ఎవరు చేశారనేది పోలీసులకు ఓ మిస్టరీగా మారుతుంది. ఇక ఈ కేసును టేక్ అప్ చేయడానికి అశోక్ చక్రవర్తి (ప్రభాస్) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనం చేసేది కూడా ప్రభాసే. 
 
ఓ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అన్ని వేల కోట్లు దొంగతనం చేయాల్సి వచ్చిందనేది ఫ్లాష్‌బ్యాక్‌లో దర్శకుడు చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తాడు. ఇక ప్రభాస్ సంగతి తెలిసి హీరోయిన్ మొదట్లో అపార్థం చేసుకున్నా.. తర్వాత ప్రేమిస్తుందట.
 
ఇకపోతే ప్రభాస్ తండ్రి ఓ శాస్త్రవేత్త.. ఒక అధునాతన జెట్‌ ప్యాక్‌ను సృష్టిస్తాడు. దానికి సంబంధించిన రహస్యాలు ఓ బ్లాక్ బాక్స్‌లో ఉంటాయి. అసలు ఆ బ్లాక్ బాక్స్‌కు.. రెండు వేల కోట్ల దొంగతనానికి మధ్య సంబంధం ఏమిటి అనేది మిగతా స్టోరీ అని చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ప్రభాస్ డబుల్ రోల్‌లో కనిపిస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో ప్రక్కన పెడితే.. 'సాహో' సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
 
ఇదిలావుంటే, శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం కోసం జ‌నాలు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బారులు తీరుతున్నారు. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని పూర్తి అయ్యాయి. సాహో సినిమా ఎప్పుడెప్పుడా చూస్తామా అని అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజుల ముందు నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర హంగామా మొద‌లైంది. 
 
అభిమానులు ప్ర‌భాస్‌కి సంబంధించి భారీ క‌టౌట్స్ ఏర్పాటు చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. భీమ‌వ‌రంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. క‌టౌట్స్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డ్యూడ్ అని చెబుతున్నారు.
 
ఇంకోవైపు, మహబూబ్‌నగర్‌లో విషాదం నెలకొంది. సాహో సినిమా విడుదలను పురస్కరించుకుని స్థానిక థియేటర్‌లో బ్యానర్ కడుతుండగా ఓ అభిమాని కరెంట్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. స్థానిక తిరుమల థియేటర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
 
ప్రభాస్ అభిమాని అయిన బోయపల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు థియేటర్ ఆవరణలో ఫ్లెక్సీ కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. థియేటర్ రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. కాళ్లు విరిగిపోయి విలవిల్లాడాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. థియేటర్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.