1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (22:38 IST)

పునీత్ రాజ్‌కుమార్ కళ్ళు నలుగురికి కంటిచూపును ప్రసాదించాయి...

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కళ్ళు నలుగురికి కంటిచూపును ప్రసాదించాయి. కర్ణాటకలో ఓ వ్యక్తి కళ్లతో నలుగురికి కంటిచూపు రావడం ఇదే తొలిసారి. ఇక ఇదే అంశంపై నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భుజంగ్ శెట్టి సోమవారం మీడియాతో మాట్లాడారు. 
 
అంత దుఃఖంలో కూడా పునీత్ కుటుంబ సభ్యులు తన కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారని.. వారి దాతృత్వం నలుగురికి కంటిచూపును ప్రసాదించిందని తెలిపారు. శుక్రవారం తాము పునీత్ కళ్ళు సేకరించామని మరుసటి రోజు వాటిని మార్పిడి చేశామన్నారు.
 
సాధారణంగా ఒక వ్యక్తి కళ్ళు ఇద్దరికి కంటి చూపు ప్రసాదిస్తాయి.. సాంకేతికతను ఉపయోగించి నలుగురికి కంటిచూపు ప్రసాదించామని డాక్టర్ శెట్టి తెలిపారు. కార్నియా పైపొరను తేలికపాటి కంటి సమస్య ఉన్నవారికి మార్పిడి చేశామని, ఎండోథెలియల్ (డీప్ కార్నియల్) తో బాధపడుతున్న వారికి లోతైన పొరను ఉపయోగించి చూపు అందించామని వివరించారు.
 
కాగా డాక్టర్ రోహిత్ శెట్టి నేతృత్వంలో డాక్టర్ యతీష్ శివన్న, డాక్టర్ షారన్ డిసౌజా, డాక్టర్ హర్షా నాగరాజ్ సర్జరీలు చేశారు. పునీత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ మరణానంతరం కళ్ళు దానం చేశారు. పునీత్ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్ 2017లో మరణించగా ఆమె మరణం తర్వాత కళ్లను దానం చేశారు.