సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (12:22 IST)

బాబాయ్ హీరో - అబ్బాయ్ నిర్మాత.. మరో మెగా ప్రాజెక్టుకు పచ్చజెండా!

టాలీవుడ్‌లో 'బాబాయ్ - అబ్బాయ్‌'గా గుర్తింపు పొందన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. వీరిద్దరి రూటే సెపరేటు. ఇందులో పవన్ ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయల్లో చక్రంతిప్పుతున్నారు. మరోవైపు, చెర్రీ కూడా హీరోగా నటిస్తూనే, నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన తండ్రితో రెండు చిత్రాలు నిర్మించిన చెర్రీ.. ప్రస్తుతం మూడో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇపుడు బాబాయ్‌తో కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. గతంలో తన తండ్రితోనే కాకుండా, బాబాయ్‌తో కూడా చిత్రాలు నిర్మిస్తానని మెగా అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ మాటను నిలబెట్టుకునే క్రమంలో బాబాయ్‌తో ఓ చిత్రాన్ని చెర్రీ ప్లాన్ చేస్తున్నారట. కాగా, ప్రస్తుతం పవన్ "వకీల్ సాబ్" చిత్రంలో నటిస్తుంటే, చెర్రీ "ఆర్ఆర్ఆర్" మూవీలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. 
 
అంతేకాకుండా, పవన్ మరికొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపేశారు. ఇందులో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రాలను చేసేందుకు అంగీకరించారు. ఈ చిత్రాలకు సంబంధించిన వివరాలను మేకర్స్‌ అధికారికంగా కూడా ప్రకటించారు. 
 
ఇవేకాకుండా పవన్‌ ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఎప్పటి నుంచో పవన్‌ని డైరెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పవన్‌ని కలిసిన జానీ మాస్టర్‌ అద్భుతమైన కథని పవన్‌కి వినిపించాడని, పవన్‌ కూడా స్టోరీ బాగుంది.. చేద్దాం అని మాట ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 
 
అంతేకాదండోయ్... ఈ సినిమాని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మించనున్నారట. పవన్‌కే కాకుండా కథను చరణ్‌ కూడా జానీ మాస్టర్‌ వినిపించాడని, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రామ్‌ చరణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అంటున్నారు. చరణ్‌తో జానీ మాస్టర్‌కి ఉన్న బాండింగ్‌ గురించి తెలియంది కాదు. అన్నీ కుదిరితే.. అతి త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన రానుందని అంటున్నారు.