శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:19 IST)

నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. ఇరుకు సందుల్లో కాదు..

SPBalu
గానగంధర్వుడు, సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సంగీత లోకానికి శుక్రవారం బ్లాక్ డేగా మిగిలిపోయింది. 40వేల పాటలు పాడి అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్పీబీకి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నివాళులర్పించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఆయనకు ఘన నివాళులర్పించింది. 
 
అయితే బాలుకు తగిన ప్రాధాన్యం, కవరేజీ ఇవ్వకపోవడంపై జాతీయ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు దర్శకుడు హరీశ్‌ శంకర్. 'ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో.. మన నేషనల్ మీడియాని చూస్తే జాలేస్తుంది.. అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..' అంటూ ట్వీట్‌ చేశారు. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. రియా చక్రవర్తి అరెస్టుకు సంబంధించి డ్రగ్స్ కేసును విస్తృతంగా జాతీయ మీడియా కవర్ చేస్తున్న నేపథ్యంలో హరీశ్ శంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతర్జాతీయ మీడియా కూడా బాలు మృతికి ఘనంగా నివాళులర్పించిన నేపథ్యంలో జాతీయ మీడియా మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు.