పిల్లలు, వృద్ధుల ఆశీర్వాదాలు పొందిన సాయితేజ్
చిత్ర కథానాయకుడు సాయిధరమ్ తేజ్ అక్టోబర్ 18వ తేదీ మంగళవారంనాడు తన పుట్టినరోజును జరుపుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని ట్రామ్పోలిన్ పార్క్‌లోని అనాథ పిల్లలతో గడిపారు. ఉదయమే బస్సులో పిల్లలను పార్క్‌లోకి తీసుకువచ్చారు. ఆయన కారులో అక్కడికి చేరుకున్నారు. ఆయన రాకతో పిల్లలు, పెద్దలు, మహిళలు ఎంతో ఆనందంగా ఆయనకు స్వాగతం పలికారు.
సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా పిల్లలు శుభాకాంక్షలు తెలుపుతూ, గాడ్ బ్లస్ యూ అంటూ ఆశీస్సులు అందించారు. అదేవిధంగా వృద్ధులు కూడా ఆయనను ఆశీర్వించారు. ఈ సందర్భంగా అక్కడ మహిళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఎటువంటి అవసరమైనా తాను ముందుండి సాయపడతానని తెలియజేశారు.
అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా గడిపి వారితో ఆటలు ఆడారు. కొందరు చిన్నపిల్లలు ఆయన నటించిన సినిమాలోని పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తే చూసి ఆనందించారు. ఈరోజు చాలా ఆనందంగా గడిపిన ఫీలింగ్‌ను వ్యక్తం చేశారు. ఆమధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కోమాలో వున్న సాయితేజ్ ఎట్టకేలకు కోలుకున్నారు. ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.