శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (17:28 IST)

తమిళ సర్కారుకు తలొగ్గిన విజయ్ 'సర్కార్' (Video)

దీపావళి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'సర్కార్'. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే 200 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్‌ను వసూలు చేసింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రతినాయకి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు ఆరోపిస్తున్నారు.
 
ఈ వివాదం కారణంగా కొన్ని చోట్ల ఆ చిత్ర ప్రదర్శనలు నిలిచిపోయాయి. అలాగే ఆ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి చిత్ర బృందం రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు.
 
మరోవైవు, ఈ చిత్రాన్ని తమ అధినేత్రి జయలలితను కించపరిచేలా తీసిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై అన్నాడీఎంకే శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందువల్ల ఆయనపై కేసు నమోదుకాగా, ఆయన్ను అరెస్టు చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఇదిలావుంటే, విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్' సినిమా వివాదంపై రాజీకుదిరింది. చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారు. జయలలితకు సంబంధించిన సన్నివేశంలో మాటలు వినిపించకుండా బీప్ శబ్దంతో మ్యూట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ని థియేటర్స్‌లో ప్రదర్శిస్తామని థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, 'సర్కార్' వివాదమై స్పందించిన రజినీకాంత్, కమల్ హాసన్‌లు.. రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను తప్పుబట్టారు. చివరకు అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు సర్కార్ యూనిట్ అంగీరించడంతో ఈ వివాదం సమసిపోయినట్టే.