1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (09:13 IST)

నాటకాలతో తన ప్రస్థానాన్ని ఆరంభించిన కైకాల

kaikala sathyanarayana
గంభీరమైన వాచకంతో, నవరస భరితమైన నటనతో అబ్బురపరిచే అభినయం, హావభావాలను పలికిస్తూ, నటనకు కొత్త భాష్యం చెప్పిన నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసంలోనే కన్నుమూశారు. ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైనశైలితో మెప్పించిన గొప్ప నటుడాయన. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 700లకు పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించి మెప్పించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించిన సత్యనారాయణ.. గుడ్లవల్లేరులో హైస్కూల్, విజయవాడ, గుడివాడలలో కాలేజీ విద్యనభ్యసించారు. నాటకాల మీద అభిరుచి పెరిగి, ఎప్పటికైనా మంచి నటుడిగా ఎదగాలని కలలు కన్నారు. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి 'పల్లె పడుచు', 'బంగారు సంకెళ్లు', 'ప్రేమ లీలలు', 'కులం లేని పిల్ల', 'ఎవరు దొంగ' వంటి నాటకాల్లో అటు విలన్, ఇటు హీరోగా మెప్పించారు.
 
ఆ తర్వాత 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో రాజమహేంద్రవరంలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండటంతో కొంతకాలం అక్కడ ఉన్నారు. స్నేహితుడు కె.ఎల్.ధర్ సలహా మేరకు సినిమాల్లో ప్రయత్నాలు చేసేందుకు మద్రాసు వెళ్లారు. అక్కడ ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో తొలిసారి సహాయ కళా దర్శకుడిగా జీవితం ప్రారంభించారు. 'కొడుకులు-కోడళ్లు' అనే సినిమా కోసం దర్శక-నిర్మాత ఎల్.వి.ప్రసాద్.. సత్యనారాయణకు స్క్రీన్ టెస్టులు చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా ప్రారంభం కాలేదు. 
 
అయితే సత్యనారాయణ పట్టు వదలని విక్రమార్కుడిలా తన సినిమా ప్రయత్నాలు కొనసాగించారు. బి.ఎ.సుబ్బారావు సూచన మేరకు ప్రముఖ దర్శక, నిర్మాత కె.వి. రెడ్డిని కలిశారు. ఆయన కూడా మేకప్ టెస్టు, వాయిస్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్లన్నీ చేసి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా 'దొంగరాముడు'లో ఆయనకు దక్కాల్సిన పాత్ర ఆర్. నాగేశ్వరరావుకు దక్కింది. 
 
నటనపై సత్యనారాయణకు ఉన్న మక్కువను చూసి చివరకు దేవదాసు నిర్మాత డి.ఎల్. నారాయణ 'సిపాయి కూతురు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన విజయం దక్కించుకోలేదు. అయితే, మూడు సంవత్సరాల కాంట్రాక్టు మీద నెలకు రూ.300లకు సత్యనారాయణ పనిచేయడంతో మరో సంస్థలో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు అవకాశాలు లేకపోవడంతో కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్‌కు డూపుగా నటించారు. 
 
అయితే, 1960లో ఎన్టీఆర్ చొరవతోనే 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి'లో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత సత్యనారాయణ టాలెంట్ గుర్తించిన విఠలాచార్య 'కనకదుర్గ పూజా మహిమ'లో సేనాధిపతి పాత్ర ఇచ్చారు. ఇది సత్యనారాయణ సినీ కెరరీ‌ను నిలబెట్టింది. అప్పుడే నాగేశ్వరమ్మను ఆయన వివాహం చేసుకున్నారు. చిన్నా, పెద్ద పాత్రలతో సంబంధం లేకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సత్యనారాయణ అందిపుచ్చుకున్నారు.