మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (16:55 IST)

పురుషుడిగా పుట్టినందుకు సిగ్గుగా ఉంది: నటుడు సిద్ధార్థ్

కొత్త సంవత్సర సంబరాల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి బెంగుళూరు నగరంలో జరిగిన సామూహిక లైంగిక వేధింపులపై నటుడు సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. దేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశ

కొత్త సంవత్సర సంబరాల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి బెంగుళూరు నగరంలో జరిగిన సామూహిక లైంగిక వేధింపులపై నటుడు సిద్ధార్థ్ ఘాటుగా స్పందించాడు. దేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అంశంపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘మన (పురుషుల) నుంచి దేశంలోని మహిళలను ఎవరు కాపాడతారు? భూమిపై ఉన్న పనికిరాని చెత్త పురుషులం.. మనమే. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి...’ అని సిద్ధార్థ్ అన్నాడు.
 
మహిళలు తమకు ఎలాంటి వస్త్రాలు ధరించాలనిపిస్తే వాటినే ధరిస్తారని, దీనిని సాకుగా చూపుతూ వారిని వేధించే వారు దానికి స్వస్తి పలకాలని హితవు పలికాడు. అత్యాచారం, లైంగిక వేధింపుల సంఘటనలకు ఏదీ న్యాయం చేయలేదని, ఏదైనా ఒక ఘటనను చూస్తే మారాలని, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆ ట్వీట్‌లో సిద్ధార్థ్ కోరాడు.
 
ఇదే అంశంపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే విధంగా స్పందించిన విషయం తెల్సిందే. మదమెక్కిన మృగాళ్లు మహిళలపై దాడులకు పాల్పడుతుంటే పిరికిపందల్లా చూసిన వాళ్లకి.. మగాళ్లని చెప్పుకునే హక్కులేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. 'బెంగళూరులో జరిగిన ఘటనలు ఎంతో కలచి వేశాయి. ఓ అమ్మాయిపై దాడి జరుగుతుంటే.. ప్రేక్షకుల్లా చూడటం పిరికిపంద చర్య. అసలు వాళ్లకు మగాళ్లని చెప్పుకునే హక్కులేద’ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో సందేశంలో విరాట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
మీ కుటుంబంలోని వారిపై ఇలాంటి అఘాయిత్యానికి బరితెగిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని సూటిగా ప్రశ్నించాడు. అడ్డుకునే వారు లేరనే ధైర్యంతోనే అరాచక మూకలు పేట్రేగి పోతున్నాయని కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కురచ దుస్తులు ధరించిన కారణంగానే ఇదంతానా..! ఆమె జీవితం.. ఆమె ఇష్టం. పురుషులు దానిని ఒప్పుకోవాలి. కానీ అధికారంలో ఉన్న వారి వ్యాఖ్యలు భయానకమ’ని కోహ్లీ అన్నాడు.