బుధవారం, 13 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 27 జులై 2023 (12:31 IST)

తమిళ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోలు: పవన్‌ కళ్యాణ్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారు

Pawan Kalyan speech
Pawan Kalyan speech
పవన్‌ కళ్యాణ్ ‘బ్రో’ ప్రీరిలీజ్‌ వేడుకలో తమిళ చలనచిత్రరంగం గురించి మాట్లాడిన విషయాలు ఆయన్ను తప్పుదోవ పట్టించేలా చేశారని తెలుగు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పష్టం చేసింది. తమిళ సినిమాల్లో తెలుగు హీరోలు నటించకూడదనే రూల్‌ పెడుతున్నట్లు తెలిసిందనీ, ఈ ఆలోచన మార్చుకోవాలని పవన్ తనదైన శైలిలో మాట్లాడారు. కానీ అసలు జరిగింది వేరు. కనీసం పవన్‌ కళ్యాణ్‌ క్రాస్‌ చెక్‌ చేసుకోండా ఆయన అనుయాయులు చెప్పిందే నమ్మడం వల్ల ఇలా జరిగిందని ఛాంబర్‌ వాపోయింది.
 
అసలు ఏం  జరిగిందంటే...
తమిళనాడులో షూటింగ్‌లో పాల్గొన్న లైట్‌మెన్‌ కార్మికుల సమస్య వల్ల గొడవ జరిగింది. గతంలో వున్న రూల్‌ 50:50 రూల్‌ను వర్తించేలా కార్మికులను తీసుకోవాలని సంబంధిత అసోసియేషన్ తీర్మానించింది. ఇలాంటి సమస్య కరోనాకు ముందు తెలుగు సినిమా రంగంలోనూ నెలకొంది. కాగా, ఇప్పుడు చెన్నైలో జరిగిన లైట్‌ మేన్‌ షూటింగ్‌ విషయంలో వున్న నియమాన్ని ఇందుకు అక్కడి ఛాంబర్‌ కూడా అంగీకరించింది. కానీ చాలా కాలం అయినా అనుకున్నట్లు గాకుండా పూర్తిగా తమిళ టెక్నీషియన్స్‌ పనిచేయడంతో అక్కడ దీక్షవరకు చేరింది. దానికి తమిళ సినీ సంఘాలు ఆధ్వర్యంలో పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరిగాయి. కానీ అది కేవలం లైట్‌మెన్‌ కార్మికుల సమస్యే కానీ హీరోలు నటించకూడదు అనేది కరెక్ట్‌ కాదనీ, అది అసలు సాధ్యం కాదని ఎవరో తప్పుదోవ పట్టించి మీడియాను ఉపయోగించుకున్నారని తమిళ సంఘాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అదేరోజు ఓ ఆంగ్ల దినపత్రిక కూలంకషంగా వివరించింది కూడా.
 
సముద్రఖని ఏమన్నారంటే..
కానీ, ఈ విషయం తెలీని ఓ జర్నలిస్టు బ్రో దర్శకుడు సముద్రఖని ఇంటర్వ్యూలో తమిళహీరోలు తమిళంలోనే నటించాలి. తెలుగువారు తమిళంలో నటించకూడదనే గొడవ జరుగుతుందని దీనిపై మీ వివరణ ఏమిటని అడిగాడు. దానికి సముద్రఖని మీరు చెప్పేదాకా నాకూ తెలియదని అన్నారు. ఆ తర్వాత ఆ జర్నలిస్టు సముద్రఖనితో కొద్దిసేపు పర్సనల్‌గా మాట్లాడారు. కట్‌చేస్తే బ్రో ప్రీరిలీజ్‌లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. సో.. ఇదంతా కూలంకషంగా తెలియకుండా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సి.కళ్యాణ్‌, ప్రసన్నకుమార్‌లు వాపోయారు. కొందరు మీడియావాళ్ళు పూర్తి అవగాహన లేకుండా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
 
ప్రముఖ ఛానల్‌ బులిటిన్‌
అదేవిధంగా ఈరోజు ప్రముఖ ఛానల్‌ కూడా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన మాటలనుద్దేశించి ఓ బులిటెన్ ను కూడా ప్రచారం చేసింది. తమిళ హీరోలు తమిళంలోనే నటించాలి. తెలుగువారు తెలుగులోనే నటించాలనే దానిపై స్పెషల్‌ బులిటెన్‌ వేశారు. దీనిపై కొందరు విలేకరులు ఛాంబర్‌ దృష్టికి తీసుకెళితే, ప్రముఖ ఛానల్‌లో కూడా సరైన వివరణ తీసుకుని ప్రచారం చేయాల్సింది కానీ వారే తప్పు ప్రచారం చేశారు. దీనిపై మీడియాపై కూడా చెడ్డపేరు వస్తుందని అన్నారు.