సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (13:14 IST)

మొబైల్ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సోనూ సూద్

వెండితెర విలన్... నిజ జీవిత రియల్ హీరో సోనూ సూద్ మరో సంచలన ప్రకటన చేశారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడుగా ఉన్న ఆయన... పేద విద్యార్థులకు కూడా అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐఏఎస్ చ‌ద‌వాల‌నుకునే పేద విద్యార్థుల కోసం త‌న ఫౌండేష‌న్ ద్వారా స‌హాయం అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. 
 
ఇపుడు సోనూసూద్ మరో అడుగు ముందుకేసి... చార్టెడ్ అకౌంటెంట్స్‌గా మారాల‌నుకునే పేద విద్యార్థుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సూద్‌చారిటీఫౌండేష‌న్‌.ఓఆర్‌జీ ద్వారా ఆస‌క్తిగ‌ల విద్యార్థులు రిజిష్ట‌ర్ చేసుకోవాల‌ని ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. 
 
అంతేకాకుండా, కేరళ రాష్ట్రంలోని వయానాడ్‌లో విద్యార్థుల కోసం సెల్‌ఫోన్ టవర్ నిర్మించాలని భావిస్తున్నారు. ట్రైబల్ ఏరియాల్లో సిగ్నల్స్‌లేని కారణంగా ఆన్‌లైన్ క్లాసుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి క్లాసులు వినాల్సిన దుస్థితి ఏర్పడింది.
 
ఇవన్నీ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో తక్కువ సిగ్నల్ వస్తుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ అస్సలు లేకపోవడంతో ఇబ్బంది కనిపిస్తుంది. 
 
ఈ విషయం సోనూ సూద్‌కు తెలియగానే మొబైల్ టవర్ నిర్మాణం చేయాలని ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు. దీని గురించి ట్వీట్ చేసిన ఆయన.. 'ఒక్కరు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. వయానాడ్, కేరళలో ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. టీంను పంపించి అక్కడ మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తాను. వెంటనే పనులు చూడాలని ఫౌండేషన్‌'ను ట్యాగ్ చేశారు.