శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (12:42 IST)

ధోనీ కంటే కర్మయోగిని మనం చూస్తామా?. అంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది?: రాజమౌళి ప్రశ్న

భారత క్రికెట్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కంటే కర్మయోగిని మనం చూస్తామా? అంటూ ప్రశ్నించాడు. అంతేనా... ధోనీకి అంత స్థితప

భారత క్రికెట్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కంటే కర్మయోగిని మనం చూస్తామా? అంటూ ప్రశ్నించాడు. అంతేనా... ధోనీకి అంత స్థితప్రజ్ఞత ఎలా వచ్చిందంటూ నవ్వుతూ అడిగాడు. ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్ర "ఎంఎస్ ధోనీ: అన్ టోల్డ్ స్టోరీ" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో ప్రత్యేక అతిథిగా రాజమౌళి పాల్గొని సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు మాట్లాడుతూ ధోనీ గొప్ప కర్మయోగి అని అన్నారు. 
 
ఎందుకంటే... వరల్డ్ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకున్న వేళ 130 కోట్ల మంది భారతీయులు సంబరాలు చేసుకుంటుంటే... ధోనీ మాత్రం కప్‌ను అందుకుని దానిని సహచరులకు అందించి, తను మాత్రం పక్కకు వెళ్లి నిలబడ్డాడని గుర్తు చేశారు. అంతేనా... క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ సమయంలో తన భావోద్వేగాలను అణచుకోలేకపోయారని, ధోనీ మాత్రం తనకేమీ పట్టనట్టు పక్కన నిలబడ్డాడని, అంత స్థితప్రజ్ఞత అతనికి ఎలా వచ్చిందా? అని తాను ఆశ్చర్యపోయానని రాజమౌళి తెలిపారు. 
 
ఇక ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీని అనుకరించలేదని, ధోనీ పాత్రలో పరకాయప్రవేశం చేశాడని అన్నారు. ఒక నటుడు ఇంకో వ్యక్తి పాత్రలో ప్రవేశించి నటించడం ఎంత కష్టమో దర్శకుడిగా తనకు తెలుసని ఆయన చెప్పారు. సుశాంత్ సింగ్ చాలా బాగా నటించాడని, ఈ చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటను చూడాలనుకుంటున్నానని రాజమౌళి తన మనసులోని మాటను వెల్లడించారు.