గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (16:46 IST)

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి.. రియా చక్రవర్తి

sushanth singh_Rhea
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, సినిమా, టీవీ పరిశ్రమలకు చెందిన కొంతమంది సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా మద్దతు తెలిపారు. 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీహార్ ఎంపీ పప్పు యాదవ్ రాసిన లేఖను సంబంధిత శాఖకు హోం మంత్రి అమిత్ షా ఫార్వార్డ్ చేశారు. ఈ విషయాన్ని పప్పు యాదవ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు అమిత్ షా సంతకం చేసిన లేఖను ట్వీట్‌లో పొందుపరిచారు.
 
ఇప్పటికే సుశాంత్ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు. సుమారు 30 మందిని విచారించి, వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. వీరిలో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంట్లో పనిచేసిన వాళ్లు, ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి, పబ్లిసిస్ట్ రోహిణి అయ్యర్, యష్ రాజ్ ఫిలింస్ క్యాస్టింగ్ డైరెక్టర్ షణూ శర్మ, దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారు.
 
మరోవైపు సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై నటి రియా చక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జూన్ 14వ తేదీన ముంబై నివాసంలో సుశాంత్ విగత జీవిగా కనిపించారు. కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, నిరాశలో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పేర్కొన్నారు. కేసు విచారణను ముంబై పోలీసులు చేపట్టారు.
 
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తన పోస్ట్‌లో రియా తనను తాను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా పేర్కొంది. అలాగే అమిత్ షాకు రాసిన లేఖలోనూ గౌరవనీయమైన అమిత్ షా సార్, నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్‌ అని రియా చక్రవర్తి తెలిపింది. సుశాంత్‌ ఆకస్మిక మరణం చెంది నెల రోజులు దాటింది. కేసు దర్యాప్తులో ప్రభుత్వ విచారణపై పూర్తి నమ్మకం ఉంది. 
 
కాగా న్యాయం కోసం ఈ విషయంలో సీబీఐ విచారణ చేయాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఒత్తిళ్లు ఏమిటో తాను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే అంటూ రియా లేఖను ముగించింది
 
జూన్ 14న బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్‌ను కుదిపేసింది. హిందీ పరిశ్రమలో ఉన్న బంధుప్రీతి, గుత్తాధిపత్యం కారణంగానే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.