దక్షిణాది చిత్రాల్లో నటించడం వల్లే గుర్తింపు రాలేదు : తాప్సీ
దక్షిణాది చిత్రాల్లో నటించడం వల్లే తనకు సరైన గుర్తింపు రాలేదంటూ ఢిల్లీ భామ తాప్సీ మరోమారు దక్షిణాది చిత్రసీమపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాధి భామకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆ చిత్రాలేవీ ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు, గుర్తింపును సంపాదించిపెట్టలేదు. దీంతో తన మకాంను బాలీవుడ్‌కు మార్చింది.
హిందీలో నటించిన పలు చిత్రాలు ఘన విజయం సాధించాయి. అప్పటి నుంచి ఆమె దక్షిణాది చిత్రసీమపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాల్లో నటించడం వల్ల తనకు గుర్తింపు రాలేదని చెప్పారు. నటిగా నిరూపించుకోవడానికి అవసరమైన పాత్రలేనీ దక్కలేదన్నారు. స్టార్ హీరోయిన్‌గా కొనసాగినప్పటికీ తనకు గుర్తింపు రాలేదని, సంతృప్తి కలగలేదన్నారు.
అదేసమయంలో బాలీవుడ్‌లో తాను నటించిన "పింక్" చిత్రం తనకు మంచి పేరుతో పాటు గుర్తింపును తెచ్చిందని చెప్పారు. ఆ సినిమా తర్వాతే తన జీవితం మలుపు తిరిగిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని తాప్పీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది కాబట్టే బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వచ్చాయనే విషయాన్ని తాప్సీ గుర్తు పెట్టుకోవాలని హితవు పలుకుతున్నారు.