తమిళ రాజకీయాల్లోకి మరో హీరో : ఫ్యాన్స్ కల సాకారం చేయనున్న 'దళపతి'
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం వివిధ పార్టీలు సర్వశక్తులను ఒడ్డి పోరాడనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్థాపించే కొత్త పార్టీ కూడా పోటీ చేయనుంది. ఇపుడు మరో తమిళ హీరో రంగంలోకి రానున్నారు. సినీనటుడు విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. అప్పుడప్పుడు అభిమానులు విజయ్ పోస్టర్లను ఏర్పాటు చేస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు.
ఇప్పుడు మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వార్తలు వస్తున్నాయి. దీంతో తన అభిమానులు నిరాశ చెందకుండా విజయ్ ఓ కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశంలో జరుగుతోన్న ఆలస్యంతో అసంతృప్తితో ఉన్న అభిమానులు ఎవ్వరూ ఇతర పార్టీల్లోకి వెళ్లొద్దని ఆయన సూచించడం గమనార్హం.
తన అభిమాన సంఘం 'మక్కల్ ఇయక్కం' నుంచి అభిమానులు వైదొలగవద్దని ఆయన కోరారు. చాలాకాలంగా సహనంతో ఎదురు చూసిన అభిమానుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందంటూ ప్రకటన చేశారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని చెప్పారు. కాగా, ఆదివారం తన అభిమాన సంఘాల నేతలతో విజయ్ సమావేశమై ఈ విషయంపై చర్చించిన విషయం తెల్సిందే.
కాగా, రజనీకాంత్ కూడా ఈ నెలాఖరులో కొత్త పార్టీ ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత జనవరిలో నెలలో ఆయన కొత్త పార్టీ పేరుతో పాటు.. పార్టీ సిద్ధాంతాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఇపుడు విజయ్ కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతుండటం అమితాసక్తిని రేపుతోంది.