1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 10 జులై 2016 (14:49 IST)

ఆగస్టులో ‘తెలుగు షార్ట్‌ఫిల్మ్ అవార్డ్ 2016’

నూతన కళాకారులు, కళా రంగానికి మధ్య వారధిగా పనిచేస్తున్న సంస్థ తెలుగు టాలెంట్.ఇన్. నూతన కళాకారులను ప్రోత్సహించడానికి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న ఈ సంస్థ ప్రభాత చిత్రవారితో కలిసి సంయుక్తంగా ‘తెలుగు షార్ట్‌ఫిల్మ్ అవార్డ్ 2016’ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నటులు, దర్శకులు కాదంబరి కిరణ్ తెలుగు షార్ట్‌ఫిల్మ్ అవార్డ్ 2016 పోస్టర్లను రిలీజ్ చేశారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ “ఇటువంటి షార్ట్ ఫిల్మ్ అవార్డుల పోటీలు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడతాయి. చిత్ర పరిశ్రమలోకి యువ టాలెంట్ వచ్చినప్పుడే ఇండస్ట్రీ మరింతగా కళకళలాడుతుంది” అని అన్నారు. పోటీల నిర్వాహకులు శశిధర్, వంశీ మాట్లాడుతూ “వివిధ విభాగాల్లో ఈ షార్ట్‌ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేస్తాం. ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరామన్, ఉత్తమ రచన, ఉత్తమ సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు విభాగాలలో అవార్డులను అందజేస్తామని తెలిపారు.
 
ఆగస్టు నెలలో నిర్వహించే ఈ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగలవారు తాము తీసిన షార్ట్ ఫిల్మ్‌ను ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు తెలుగు టాలెంట్.ఇన్, ప్రభాత చిత్ర.కామ్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి”అని తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, నటుడు, రచయిత రావి కొండలరావు, సినిమాటోగ్రాఫర్ మీర్, నటుడు, దర్శకుడు కాదంబరి కిరణ్, నటులు ప్రసాద్‌బాబు, రాజీవ్ కనకాల, దర్శకుడు బాబ్జి, సంగీత దర్శకుడు రవివర్మ ఉంటారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ, నిర్వాహకులు శశిధర్, వంశీ, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.