1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (18:46 IST)

ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే - శివకార్తికేయన్‌

Sivakarthikeyan
‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.
 
ఇతర డాక్టర్లకు, ఈ ‘డాక్టర్‌’కు వ్యత్యాసం ఏమిటి?
‘డాక్టర్‌’ గురించి పూర్తిగా తెలియాలంటే సినిమా చూడాలి. ప్రతి డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తారు. ఈ డాక్టర్‌ చేసే ఆపరేషన్‌ డిఫరెంట్‌. హీరో పేరు వరుణ్‌. అతను ఆర్మీ డాక్టర్‌. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి.
 
ట్రైలర్‌ చూస్తుంటే స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంది?
యాక్షన్‌, థ్రిల్‌ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. కానీ, ఇద్దరి మధ్య మైండ్‌ గేమ్‌ నడుస్తుంది. ఫిజికల్‌ ఫైట్‌ కాకుండా మెంటల్‌ ఫైట్‌లా సినిమా ఉంటుంది. ఎవరు తెలివైనవారు అనే అంశం మీద నడుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం హ్యూమర్‌, కొంచెం థ్రిల్‌ ఇస్తుంది.
 
మీ పాత్ర తీరు ఎలా వుంటుంది?
వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే. కామెడీ సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు నేను నవ్వితే  నెల్సన్‌ అరిచేవాడు. ‘నువ్విలా చేస్తే సీన్‌ రెండో రోజు చేయాలి. అప్పుడు ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరుగుతుంది. ఓకేనా?’ అని అడిగితే మౌనంగా ఉండేవాడిని.
 
తమిళ వెర్షన్‌లో రెండు పాటలను మీరు రాశారు. ‘సో బేబీ...’ పాటకు ముందు అనిరుధ్‌, దర్శకుడితో డిస్కషన్‌ చేసిన వీడియో విడుదల చేశారు?
జనరల్‌గా మేం మాట్లాడుకునేదాంట్లో 10 శాతం మాత్రమే చూపించాం. మా డిస్కషన్స్‌ అలానే ఉంటాయి. ఫస్ట్‌ ‘చెల్లమ్మ’ (తెలుగులో ‘చిట్టమ్మ’) పాట రాశా. తర్వాత ‘సో బేబీ... చాలామందితో రాయించాం. కుదరలేదు. నువ్వు రాయి’ అన్నారు. ట్రై చేశా. ‘చెల్లమ్మ’ సాంగ్‌ ముందు సినిమాలో అవసరం లేదు. ఎందుకంటే.  బ్రేకప్‌తో మొదలవుతుందని చెప్పా కదా! అనిరుధ్‌ ‘సాంగ్‌ ఎక్కడ పెడతారు?’ అని అడిగారు. ‘అది తర్వాత చూద్దాం! ముందు నువ్వు చెయ్‌’ అని చెప్పాం. హ్యాపీగా రాశా. సినిమాలో మంచి సందర్భం కుదిరింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. వీడియో చూసి ‘బుట్టబొమ్మ’లా ఉందని చెబుతున్నారు.
 
కథ విన్నాక సినిమా నిర్మించాలనుకున్నారా? ముందే హీరోగా, నిర్మాతగా చేయాలనుకున్నారా?
దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. టీవీలో నేను షోస్‌ చేసినప్పటి నుంచి తెలుసు. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు.
 
తెలుగులో కరోనాకు ముందు విడుదలైన చివరి సినిమా మీదే ‘శక్తి’. మళ్లీ ఆ సినిమా నిర్మాత కోటపాడి జె. రాజేష్ ‘దీనిని విడుదల చేస్తున్నారు. ఆయనతో మీ అసోసియేషన్‌ గురించి?
 లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు తెలుగులో ఆ సినిమా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ను అప్రిషియేట్‌ చేయాలి. లేదంటే ఓటీటీకి సినిమా వెళ్ళేది. తమిళనాడులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. అక్కడ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ఇదే. ఇన్నాళ్ళూ ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలతో ఇంట్లో ఉన్న పేరెంట్స్‌ కూడా సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారని నమ్ముతున్నా.
 
తెలుగు సినిమా చేయబోతున్నారని విన్నాం. ఎప్పుడు ఆ సినిమా మొదలు కానుంది?
నిర్మాతలే అధికారికంగా సినిమా వివరాలు ప్రకటిస్తారు. ఆ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నా. నాకు తెలుగు కొంచెం వచ్చు. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నెక్ట్స్‌ టైమ్‌ హైదరాబాద్‌ వస్తే... పూర్తిగా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమా నా ప్లాన్‌లో లేదు. సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ ‘ఇటువంటి కథ ఉంది’ అని చెప్పాడు. దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా.