నాలుగేళ్ల తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం నాలుగేళ్ల తర్వాత బుధవారం నిర్వహిస్తున్నారు. 2017 మార్చి 23వ తేదీన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 17వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరు కానున్నారు.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆర్ట్స్-51, సైన్స్-77, ఇంజినీరింగ్-22 మంది చొప్పున 150 మంది విద్యార్థినులకు బంగారు పతకాలను అందించనున్నారు. 31 మంది సైన్స్ విద్యార్థినులు పుస్తక బహుమతులు అందుకుంటారు. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు నగదు బహుమతులు స్వీకరిస్తారు.
వీరితో పాటు 216 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు, 16 మంది ఎంఫిల్, 1137 మందికి పీజీ, 1177 మందికి యూజీ డిగ్రీలు అందించనున్నారు. దూరవిద్యలో పీజీ-177, డిగ్రీ-331 మంది స్నాతకోత్సవ డిగ్రీలు అందుకుంటారు.
ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందే మొత్తం 3054 మందికి గాను, ఇన్‌పర్సన్-1453, ఇన్‌అబ్సెన్షియా-1112, ఇన్‌అడ్వాన్స్-489 మందికి స్నాతకోత్సవ డిగ్రీలను ప్రకటించారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా (పోపూరి లలిత కుమారి) కి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.