శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:10 IST)

బార్లు - పబ్బులకు లేని ఇబ్బంది థియేటర్లకు ఎందుకు : హీరో నాని (video)

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై హీరో నాని మండిపడ్డారు. బార్లు, పబ్బులకు లేని ఇబ్బంది థియేటర్లకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో అన్నింటికంటే ముందు థియేటర్లను బంద్ చేశారని, అన్నింటికంటే ఆలస్యంగా థియేటర్లను ఓపెన్ చేశారని గుర్తుచేశారు. 
 
తెలంగాణలో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం తాజాగా అనుమతి ఇచ్చింది. దీనిపై హీరో నాని స్పందిస్తూ, బార్లు, పబ్‌లలో అందరూ మాస్కులు తీసేసి, గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారని... థియేటర్లలో మాస్కులు పెట్టుకుని సినిమాను ఎంజాయ్ చేస్తుంటారని... బార్లు, పబ్బుల కంటే థియేటర్లే సేఫ్ అని చెప్పారు.
 
థియేటర్లపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయని... ఇవి మూతపడటం వల్ల వారందరి జీవితాలు రోడ్డుపై పడ్డాయని నాని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా సమయంలో థియేటర్లనే ముందుగా ఓపెన్ చేయాలని తాను చెప్పడం లేదని... మిగిలిన వాటితో పాటు థియేటర్లను కూడా ఓపెన్ చేయమని మాత్రమే చెపుతున్నానని నాని అన్నారు.
 
సినీ నటుడిగా కాకుండా... ఒక సినీ ప్రేక్షకుడిగా తాను ఈ మాట చెపుతున్నానని వ్యాఖ్యానించారు. విదేశాల్లో వీకెండ్ వస్తే అమ్మానాన్నలను చూడ్డానికి వెళతారని... మన దేశంలో అమ్మానాన్నలతో కలసి సినిమాకు వెళతారన్నారు. ఇతర దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స‌ని కలిసేందుకు వెళ్తే, మన దేశంలో ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళతారని నాని అన్నారు. 
 
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లలో సినిమాలు చూడటం మన సంస్కృతి అని చెప్పారు. పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లకు జనాలను దూరం చేస్తే... రాబోయే తరాలు థియేటర్లను మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నాని ఆవేదన వ్యక్తం చేశారు.