ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఫిబ్రవరి 2024 (23:56 IST)

కన్నీళ్లు పెట్టిస్తున్న దంగల్ నటి సుహానీ మరణం, అసలు కారణం ఇదే

Suhani Bhatnagar
దంగల్ చిత్రం చూసినప్పుడు ఆ చిత్రంలో చిన్ననాటి ఫొగట్ పాత్రలో ఎంతో చక్కగా నటించిన బాలిక సుహానీ భట్నాగర్. ఆ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఆ బాలికకు అద్భుతమైన భవిష్యత్తు వుంటుందని అనుకున్నారు. కానీ విధి ఆడిన నాటకంలో ఆ అద్భుతమైన బాల నటి మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె కలలు తీరకుండానే మరో లోకానికి తరలి వెళ్లిపోయింది. రెండు నెలలు క్రితం వరకూ ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ అన్నింటిలో రాణిస్తూ వున్న సుహానికి వున్నట్లుండి కాళ్లూ చేతులులో వాపు కనిపించిందట.
 
ప్రముఖ మీడియా సంస్థతో సుహాని తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం... సుహానీ డెర్మటోమయోసిటిస్‌తో బాధపడుతున్నారని చెప్పారు. ఈ అరుదైన పరిస్థితి రెండు నెలల క్రితం ఆమె చేతుల్లో వాపును చూసినప్పుడు గుర్తించబడింది. ఆ వాపు తర్వాత ఆమె శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఆసుపత్రికి తీసుకుని వెళ్లి సుహానికి చెక్ చేయించగా, ఆమెకి చిన్నపాటి ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, దీంతో ఆమె ఊపిరితిత్తులతో సహా శరీరంలో ద్రవం పేరుకుపోయిందని చెప్పారు. దీనితో సుహానీని వెంటిలేషన్ ఉంచి చికిత్స చేయించడం ప్రారంభించారు. ఐతే ఆమె ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. ఆమెకి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్స్ వల్ల ఆమె రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. దానితో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొద్దిసేపటికే AIIMS వైద్యులు ‘సుహానీ ఇక లేరు’ అని చెప్పారు.
 
సుహానీ గ్రాడ్యుయేషన్ త్వరలో పూర్తి కానుంది. ఇది పూర్తి కాగానే సుహాని నటనకు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తల్లి చెప్పారు; ఆమె జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్ చదువుతోంది. కాలేజీలో చాలా బాగా రాణిస్తోంది, చివరి సెమిస్టర్‌లో కూడా ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ఐతే చదువు పూర్తి చేసుకుని తిరిగి నటించాలన్న ఆమె కల తీరకుండానే ప్రాణాలు కోల్పోయింది.