'అన్నయ్య - తమ్ముడు'కి కరోనా కష్టాలు : కొత్త సినిమాల్లో జాప్యం!
టాలీవుడ్‌ను శాసిస్తున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామీలీకి చెందిన అనేక మంది హీరోలుగా రాణిస్తున్నారు. వీరిలో అగ్రగణ్యుడు చిరంజీవి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రాం చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్, నీహారిక ఉన్నారు.
అయితే, ఇపుడు ఈ ఫ్యామిలీ హీరోలు తీస్తున్న చిత్రాలపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా, చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కరోనా ముందస్తు జాగ్రత్తగా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.
అలాగే, చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం "వకీల్ సాబ్". వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం కనిపిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, పార్కులు ఇలా అనేకవాటిని మూసివేశారు.
నిజానికి చిరంజీవి 'ఆచార్య' చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకురావాల్సివుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దసరాకు కూడా విడుదల కష్టమేననే అభిప్రాయలు వినబడుతున్నాయి. దసరాకు రిలీజ్ చేయకపోతే వచ్చే యేడాది వేసవి వరకు ఆగాల్సిందే. సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' విడుదలవుతోంది. కాబట్టి అప్పుడు రిలీజ్ చేయడం కుదరదు. మరి, చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
అలాగే, పవన్ 'వకీల్ సాబ్' చిత్రాన్ని కూడా మే 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకు తగిన విధంగా షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 21న కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్‌లను వాయిదా వేయాలని నిర్మాతల మండలి సూచించడంతో ఇప్పుడు షెడ్యూల్‌పై అనుమానం నెలకొంది. ఈ షెడ్యూల్ ఆలస్యం అయితే.. సినిమా విడుదల కూడా వాయిదా పడేలాగానే ఉంది. ప్రస్తుతం దర్శక నిర్మాతలు షెడ్యూల్ విషయమై పవన్‌తో చర్చలు జరుపుతున్నారన్నది టాక్.